తెలంగాణలో వరద నష్టం రూ.5వేల కోట్లు..

byసూర్య | Fri, Oct 16, 2020, 09:13 AM

ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అస్తవ్యస్తమైన జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే బీభత్సమైన ఆ వాన మిగిల్చిన నష్టం బాధితులకు తీరని ఆవేదన మిగిల్చింది. ఇళ్లు కూలినవాళ్లు,వరదల్లో తమవాళ్లను కోల్పోయినవాళ్లు,పంట నష్టపోయినవాళ్లు గోడు గోడున విలపిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం... రాష్ట్రంలో వర్షం బీభత్సం మిగిల్చిన నష్టం రూ.5వేల కోట్లు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో రూ.600 కోట్లు రైతులకు సహాయం అందించేందుకు... మరో రూ.750 కోట్లు జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాసం, పునరుద్ధరణ చర్యల కోసం అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వానలు,వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.


 


వర్ష బీభత్సం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. రాష్ట్రంలో సుమారు 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో సగం పంట దెబ్బతిన్నా రూ.2వేల కోట్లు నష్టం సంభవించినట్లే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం కనిపిస్తోంది. 238 కాలనీలు జలమయమవగా... 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ట్రాన్స్‌ కో పరిధిలో 9 సబ్‌స్టేషన్లు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 15 సబ్‌స్టేషన్లు, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2 సబ్‌స్టేషన్లలోకి నీళ్లు చేరాయి. అన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన నీళ్లను తొలగించారు. మూసీ నది వెంబడి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు స్తంభాలు కొట్టుకుపోవడంతో.. విద్యుత్తుశాఖకు రూ.5 కోట్ల మేర నష్టం జరిగింది.


 


రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువుల కట్టలు తెగిపోగా, 26 చెరువులకు బుంగలు పడ్డాయి. జల వనరుల శాఖకు రూ.50కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 475 చోట్ల పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతిన్నాయి. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో సుమారు రూ.295కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. 113చోట్ల ఆర్‌&బీ రోడ్లు, 6 చోట్ల నేషనల్‌ హైవేలు దెబ్బతిన్నాయి. ఆర్‌&బీకి రూ.184కోట్లు, నేషనల్‌ హైవేలకు రూ.11కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో 445 చోట్ల బీటీ రోడ్లు, 6 చోట్ల నేషనల్‌ హైవేలు దెబ్బతిన్నాయి. అన్నిచోట్ల యుద్ద ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.


 


జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు వరదలకు ప్రభావితమయ్యాయి. ఎల్బీ నగర్‌, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. నగరంలో 14 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా... 65 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నగరంలో మొత్తం 72 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించారు. రోజుకు 1.10 లక్షల మందికిభోజనం అందిస్తున్నారు.


 


వాన బీభత్సానికి మృతుల సంఖ్య 50కి చేరింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 11 మంది మృత్యువాతపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. భారీ వర్షాలకు చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న కాలనీల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. అపార్టుమెంట్ల సెల్లార్లలో కూడా భారీగా వరద నీళ్లు చేరాయి. ఈ నేపథ్యంలో ఇకనుంచి అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతినిచ్చే ముందు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సెల్లార్లలో వరద నీరు నిలిచి ఉండకుండా... బయటకు వెళ్లే ఏర్పాటు ఉన్నవాటికే అనుమతులు ఇవ్వాలన్న నిబంధన పెట్టాలన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM