by సూర్య | Thu, Oct 31, 2024, 10:31 PM
భానుమతి హైబ్రీడ్ పిల్ల.. ఒక్కటే పీస్.. అంటూ 'ఫిదా' చిత్రంతో సాయి పల్లవి తెలుగులో కథానాయికగా అరంగ్రేటం చేసింది. తొలి చిత్రంతోనే అందరి హృదయాలు గెలుచుకున్న ఈ అందాల తార ఆ తరువాత నటించిన ప్రతి చిత్రంలోనూ తన మార్క్ నటనను కనబరుస్తూ పాప్యులారిటీని పెంచుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా... రికార్డు స్థాయి పారితోషికాలు ఆఫర్ చేసినా సాయి పల్లవి మాత్రం అందరి లాంటి హీరోయిన్ కాదు. కేవలం తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే సెలెక్టివ్‌గా చేస్తుంటుంది. ఈ కోవలోనే ఆమె నటించిన తెలుగు, తమిళ భాష చిత్రం అమరన్. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్ద పబ్లిసిటి, హడావుడి లేకుండా సైలెంట్‌గా థియేటర్‌లో విడుదలైన అమరన్‌కు తెలుగులో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు ఎవరూ ఊహించని ప్రారంభ వసూళ్లు రావడం విశేషం. అయితే ఇదంతా సాయి పల్లవి క్రేజ్‌కు నిదర్శనం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రంలో ఇందు రెబెకా వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి తన నటనతో అందరిని ఆకట్టుకుందని అంటున్నారు, అమరన్ చిత్ర కథ కూడా సాయి పల్లవి కోణంలోనే కొనసాగుతుందట. ఈ చిత్రంలో సైనికుడి భార్యగా ఆమె నటనకు అందరూ అభినందలను చెబుతున్నారు. కేవలం సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ వల్లే ఈ చిత్రానికి ప్రారంభ వసూళ్లు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే నాగచైతన్యతో ఆమె కలిసి నటించిన తండేల్ చిత్రం కూడా విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో కూడా ఆమె పాత్రను దర్శకుడు చందు మొండేటి డిజైన్ చేసిన విధానం అందర్ని ఆకట్టుకుంటుందని సమాచారం.
Latest News