మహిళలకు మద్దతుగా ఉంటుందీ సినిమా : అనన్యా నాగళ్ల

by సూర్య | Wed, Apr 07, 2021, 11:30 AM

''నా స్నేహితులతో, చిత్రసీమలో తెలుగమ్మాయిలతో 'మనకు అవకాశాలు రావు. తమిళ్‌కి వెళ్లాలి. అక్కడ నిరూపించుకొని ఇక్కడకు వస్తే ఛాన్సులు వస్తాయేమో?' వంటి చర్చ జరిగేది. నటనలోకి రావాలనుకునేవాళ్లకూ, ఇప్పటికే వచ్చినోళ్లకూ, నా స్నేహితులకూ 'వకీల్‌ సాబ్‌' ఓ హోప్‌ ఇచ్చింది. మన తెలుగమ్మాయి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో నటించిందంటే... మనమూ చేయవచ్చని అనుకుంటారు కదా!'' అన్నారు అనన్యా నాగళ్ల. పవన్‌ కల్యాణ్‌ న్యాయవాదిగా నటించిన 'వకీల్‌ సాబ్‌'లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదలవుతోంది. అనన్య చెప్పిన సంగతులివీ...


ముగ్గురమ్మాయిల్లో తన పనేదో తాను చేసుకొనే ఓ అమాయకపు అమ్మాయిగా కనిపిస్తా. అటువంటి ఆమెకు సమస్య వస్తే? బాధగా ఉంటుంది కదా! నా పాత్రపై జాలి కలుగుతుంది. 'అయ్యో పాపం! ఈ అమ్మాయికి ఇలా జరిగిందా?' అని ప్రేక్షకులు అనుకుంటారు. దర్శకుడు శ్రీరామ్‌ వేణు వల్ల ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆయన 'మల్లేశం' చూసి ఆడిషన్స్‌కు పిలిచారు. యాక్టింగ్‌, డబ్బింగ్‌ ఎలా ఉందో చూసి ఎంపిక చేశారు. ఆడిషన్స్‌ చేసేటప్పుడు పవన్‌కల్యాణ్‌గారు చేస్తున్నారా? లేదా? అనే డౌట్‌ ఉంది. నేను ఎంపికయ్యాక వేణుగారిని 'పవర్‌స్టార్‌ చేస్తున్నారా?' అని అడిగా. 'నీకు తెలియదా?' అన్నారు (నవ్వులు). చిత్రసీమలో చాలా రిజెక్షన్స్‌ చూశా. అందుకని, చిత్రీకరణకు వెళ్లేంతవరకూ ఓ సందేహం ఉండేది. రెండుమూడు రోజులు చిత్రీకరణ చేశాక... ఆనందించా.


మహిళలకు మద్దతుగా ఉంటుందీ సినిమా. అబ్బాయిలను సరిగా పెంచాలని చెబుతుంది. సమాజంపై ఈ సినిమా ప్రభావం చూపిస్తుందనీ, మార్పు తెస్తుందనీ ఆశిస్తున్నా. ప్రస్తుతం ఇటువంటి సినిమా అవసరం.


 


పవన్‌తో మాట్లాడటానికి మొదట భయం వేసింది. ఆయనే దగ్గరకొచ్చి 'మల్లేశం'లో కొన్ని సన్నివేశాలు చూశానని చెప్పారు. నేను కంఫర్టబుల్‌గా ఉండేలా మాట్లాడారు. ఆయనతో కోర్టు సీన్లు చేసినప్పుడు... ఫ్రేమ్‌లో నేను లేకున్నా, ఆయనకు ఎదురుగా ఉండి డైలాగులు చెప్పేదాన్ని. 'ప్రతిసారీ అంతే ఎమోషన్‌తో ఎలా నటిస్తున్నారండీ! బాగా చేస్తున్నారు' అని ప్రశంసించారు. మా మధ్య సీరియస్‌ టాపిక్స్‌ డిస్కషన్స్‌కు వచ్చేవి. పవన్‌, అంజలి, ప్రకాశ్‌రాజ్‌... ముగ్గురూ ఉంటే సెట్‌లో వాతావరణం సరదాగా ఉండేది.


 


ఇండస్ట్రీలో నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. కానీ, ఇబ్బందులున్నాయని విన్నాను. తెలుగమ్మాయిలు యాటిట్యూడ్‌ చూపిస్తారనే ముద్ర పడటం వల్ల అవకాశాలు రావడం లేదు. అంతకు మించి సమస్యలేవీ లేవు. కథ, పాత్ర నచ్చితే నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇటువంటి పాత్రల్లోనే కనిపించాలనే నియమాలు పెట్టుకోలేదు. ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నా. ఓ బబ్లీ రోల్‌ చేశాక... మళ్లీ నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయాలనుకుంటున్నా.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM