అంతుచిక్కని అద్భుతాలకు నిలయంగా ఆ క్షేత్రం

by సూర్య | Thu, Jun 23, 2022, 07:38 AM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన యాగంటిలో అంతుచిక్కని అద్భుతాలు దాగివున్నాయి. ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద రహస్యమే దాగివుంది. నేటికి దానిని ఛేదించటం ఎవరి వల్ల కావాట్లేదు. అందుకే యాంగటి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని భక్తుల పూజలతో విరాజిల్లుతుంది.
యాగంటిలో ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. వాస్తవానికి ఇక్కడ పరమశివుని ఆలయం నిర్మించటానికి ఒక చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని సంకల్పించారు. అదే సమయంలో రాజుకి శివుడు కలలో ప్రత్యక్షమై తనకు ఇక్కడే గుడి కట్టాలని అదేశించాడని, ఆ క్రమంలోనే శివుడు,పార్వతి ఒకే లింగంలో దర్శనమిచ్చేలా ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.

ఇక అగస్త్య మహాముని చేసిన యాగం వలెనే ఈ క్షేత్రానికి యాగంటి అని పేరు వచ్చిందని చెప్తారు. శైవ క్షేత్రమే అయినా ఈ ఆలయం వైష్ణవాలయాన్ని పోలి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి కోసం మొదలు పెట్టింది కాబట్టి శిల్ప చాతుర్యం అంతా వైష్ణవ సంప్రదాయం లోనే ఉంటుంది.

అంతుచిక్కని అద్భుతాలు :
ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన గుహలతో పాటు కొండకోనల నడుమ ఈ క్షేత్రం కొలువై ఉంటుంది. ఈ పుణ్య క్షేత్రం లో ప్రముఖంగా చెప్పబడే యాగంటి బసవన్న స్వయంభువుగా వెలిశాడని చరిత్రచెబుతుంది. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది.
ఈ బసవన్న విగ్రహం ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఏకంగా పురావస్తు శాఖ నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలను సైతం ఆలయంలో ఏర్పాటు చేశారు. అంతకంతకు పెరిగిపోతుండటం అటు భక్తులను ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. యుగాంతంలో యాగంటిలోని నంది పైకిలేచి రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారని చెప్తుంటారు. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలోనే ఈ యాగంటి క్షేత్రం ఉండటం విశేషం.
ఇకపొతే ఇక్కడ మరో విశేషమేటంటే ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాకులు కనిపించకపోవడం వెనుక ఒక పురాణ గాధ ఉంది. అగస్త్య మహా ముని యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాంసం ముక్కలను యాగ గుండంలో వేసి ఆటంకం కలిగించారట. దీంతో కోపంతో ఆ మహాముని ఈ క్షేత్రంలో కాకులు తిరగకూడదని శాపం ఇచ్చాడని చెబుతారు. అప్పటినుంచి ఈ ఆలయ పరిసరాల్లో కాకులు తిరగవు.
పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యప్రదం
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలోనైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. పర్వత సానువుల్లో నుంచి ఉద్భవించే నీరు ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ప్రవహిస్తూ ఆలయ ప్రాంగణంలోని కోనేరు లో చేరుతుంది. కోనేరులోని నీరు అన్ని కాలాల్లో ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో యాంగటిని సందర్శిస్తారు.
యాగంటి క్షేత్రానికి చేరుకోవడం ఎలా
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి జిల్లా కేంద్రమైన నంద్యాల నుంచి 48 కిలోమీటర్ల దూరంలో గల బనగానపల్లె పట్టణానికి చేరాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మరో 11 కిమీ ప్రయాణిస్తే యాగంటికి చేరుకోవచ్చు. రోడ్డు సదుపాయం మెరుగ్గా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. నంద్యాల వరకు రైలు సదుపాయం కలదు.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM