నేటి సాయంత్రానికి శివసేన డెడ్ లైన్...లేకపోతే వేటేనని స్పష్టీకరణ

by సూర్య | Wed, Jun 22, 2022, 04:38 PM

తన పార్టీ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకొనేందుకు శివసేన సస్పెన్షన్ అస్త్రం ప్రయోగిస్తోంది. ఈ సాయంత్రం ఐదు గంటల లోపు తిరిగి రాకపోతే మీపై సస్పెన్షన్ తప్పదని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శివసేన అధినాయకత్వం తీవ్రంగా హెచ్చరించింది. మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకూ మారుతున్నాయి. నిన్న మంత్రి ఏక్ నాథ్ షిండే పార్టీలో సగానికి పైగా ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలుచేసిన సీఎం ఉద్ధవ్ థాక్రే విఫలమయ్యారు. దీంతో ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. అయితే దీనికి మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధంగా లేకపోవడంతో శివసేన రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించేందుకు మరో ప్రయత్నం ప్రారంభించారు.


ఏక్ నాథ్ షిండేతో వెళ్లిన రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేస్తారని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆశిస్తున్నట్లు ముంబైకి కాంగ్రెస్ పరిశీలకుడిగా వెళ్లిన కమల్ నాథ్ వెల్లడించారు. అదే సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేందుకు సాయంత్రం ఐదు గంటల వరకూ డెడ్ లైన్ పెడుతున్నట్లు శివసేన ప్రకటించింది. ఆ లోపు రాకపోతే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించింది. దీంతో రెబెల్ ఎమ్మెల్యేలతో తాడోపేడే తేల్చుకునేందుకు ఉద్ధవ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


శివసేన డెడ్ లైన్ ప్రకటించిన నేపథ్యంలో ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వచ్చేశారు. ఏక్ నాథ్ షిండేతో పాటు వెళ్లిన రెబెల్ ఎమ్మెల్యేలు కైలాశ్ పాటిల్, నితిన్ దేశ్ ముఖ్ తిరిగి వెనక్కి వచ్చేసినట్లు ప్రకటించారు. షిండే వర్గం తమను కిడ్నాప్ చేసిందని వీరిద్దరూ ఆరోపించారు.


అలాగే ఉద్ధవ్ థాకరే పై వారు విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు సాయంత్రం ఐదు గంటల వరకూ రెబెల్ ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ ఇచ్చిన శివసేన.. ఇది ముగిసిన తర్వాత కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి కరోనాతో బాధపడుతున్న సీఎ ఉద్ధవ్ వర్చువల్ విధానంలో హాజరవుతారని తెలుస్తోంది.

Latest News

 
గుంటూరులో వైసీపీలోకి చేరికలు Fri, May 03, 2024, 06:12 PM
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM