సామాన్యులను హడలెత్తిస్తున్న అధిక ధరలు

by సూర్య | Sat, May 14, 2022, 03:46 PM

సత్యం.. ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇతని నెల జీతం రూ.20 వేలు. ఇంట్లో ఉండేది నలుగురు. వీళ్లకు మూడేళ్ల క్రిందటివరకు నెల ఖర్చు పోను కొంత దాచుకునేవాడు. ఈ మూడేళ్లలో జీతం కూడా ఏమంత పెరిగిందేమీ లేదు. కానీ ఖర్చులు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో నిత్యావసరాల వ్యయం భారీగా పెరిగింది. ఇది ఒక్క సత్యం పరిస్థితే కాదు. రాష్ట్రంలోని సగటు మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇలానే ఉంది.


వైసీపీ మూడేళ్ల పాలనలో నిత్యం ఏదో ఒక వస్తువు ధర పెరుగుతూనే ఉంది. దీనికితోడు ఉపాధి మార్గాలు లేకపోవడంతో పేదల బతుకులు తలకిందులయ్యాయి. నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరగడంతో జనాలకు నిత్యావసర ధరలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. అసలే ఆదాయం లేక సామాన్యులు,


మధ్య తరగతి వారు ఇబ్బంది పడుతుంటే పెరుగుతున్న ధరలు మరింత భయపెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణ భారం పెరిగిందని వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. రోజు వారిగా వినియోగించే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. అధికారులు తనిఖీలు చేపట్టిన రోజు మాత్రం మామూలు ధరకు విక్రయించి మిగిలిన రోజుల్లో ధర పెంచి అమ్ముతున్నారు.


పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా


జిల్లాలో ప్రజలకు అవసరమైన నిత్యావసరల్లో చాలా వరకు ఉత్తర,దక్షిణ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు తీసుకురావడానికి రవాణా చార్జీలు పెను భారంగా మారాయని టోకు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉప్పు దగ్గర్నుంచి బియ్యం , కంది బేడలు, వంట నూనె వరకు పెరిగిన ధరలతో అవస్థలు పడుతున్నారు. కేజీ ఉప్పు ధర రూ.20 నుంచి రూ.25 అమ్ముతున్నారు. వంట నూనె ధర లీటరు రూ.150 నుంచి 198 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి వస్తువుపై 30 శాతం నుంచి రెట్టింపు ధర పలుకుతున్నాయి. దింతో సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులను కొని, తినలేని పరిస్థితి నెలకొంది.


పెరుగుదల ఇలా..


సన్ ఫ్లవర్ ఆయిల్ గత ఏడాది ఏప్రిల్ లో రూ.95 ఉండేది ప్రస్తుతం రూ.198, చింతపండు రూ.135 నుంచి రూ.160, పెసరపప్పు రూ.84 నుంచి రూ.120, ఎండు మిర్చి రూ.140 నుంచి రూ.260, బెల్లం రూ.47 నుంచి రూ.60, ఉప్పు రూ.20 నుంచి రూ.25, జొన్నలు రూ.30 నుంచి రూ.45, సెనగపప్పు రూ.65 నుంచి రూ.80, మినపప్పు రూ.75 నుంచి రూ.120కి పెరిగింది.


కృత్రిమ కొరత సృష్టించి..


కొందరు వ్యాపారులు ప్రత్యేకంగా ఒక్కో సరుకును భారీ స్థాయిలో తెచ్చి అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. ఇటీవల ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరిగిన యుద్ధంతో వంట నూనె ధరలు, కందిబేడలు ధరలు భారీగా పెరిగాయి. దిగుమతి లేదని నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించారు. ఆయిల్ కంపెనీలు సైతం అదే బాట పట్టి సొమ్ము చేసుకున్నాయి.


నిర్మాణ రంగం కుదేలు


వైసీపీ పాలనలో నిర్మాణ రంగానికి సంబంధించిన వాటి ధరలు విపరీతంగా పెరిగి ఆ రంగం కుదేలైంది. భవన నిర్మాణ పనులు లేక కార్మికులకు ఉపాధి కరువైంది. మూడేళ్ల కిందట ట్రాక్టర్ ఇసుక రూ.2,300 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.6 వేలు వెచ్చించాల్సి వస్తోంది. సిమెంట్ ధరలు గ్రేడ్ ల వారీగా పోల్చితే ఒక్కో బస్తాపై సుమారు రూ.100 పెరిగింది. ఇనుము టన్ను రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.90 వేలకు చేరింది. ఓవైపు కొవిడ్ వ్యాప్తితో క్షీణించిన నిర్మాణ రంగంపై...మరోవైపు అడ్డూ అదుపు లేకుండా ధరల భారం పడడంతో మరింత కుదేలైంది.


పండుగ కానుకలు లేవు


అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ప్రభుత్వం నుండి పండుగ కానుకలు కూడా అందడం లేదు. గత ప్రభుత్వం సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగల సమయంలో ప్రత్యేకంగా కానుకలు అందజేసింది. సుమారు 9 రకాల సరుకులను ప్యాకేజీగా ఇచ్చేది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ కానుకలేవీ అందజేయడం లేదు సరి కదా రేషన్ కార్డుదారులకు ప్రతినెలా బియ్యం తప్ప.. పంచదార, కందిపప్పు కూడా సక్రమంగా అందించడం లేదు.


సామాన్యుల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. తినే తిండి గింజ నుంచి ప్రజలకు అవసరమయ్యే ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్న?

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM