మూడు రోజుల సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత..!

by సూర్య | Wed, Jan 12, 2022, 01:57 PM

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు.


మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. ఇక్కడి నుండి ఉత్తరాయణ పుణ్య కాలము ప్రారంభం. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన మొదలు తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము.


పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర,వస్త్రం, కూరగాయాలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తారు. గోదానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని విశ్వసిస్తారు.


ఖగోళ పరంగా ..


మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడై తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుటచేత సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి అంటేనే పాతను వదిలి క్రొత్తదనానికి స్వాగతం పలుకే రోజు. ఈ రోజు సూర్యుని చుట్టూ పరిభ్రమించు భూమి దిశను సంక్రాంతితో సూర్యుడు కోంత ఉత్తరం వైపు మారును కాబట్టి ఈ కాలమును ఉత్తరాయణం అంటారు. ఈ కాలంలో సూర్యుని సంక్రమణముతో పాటు మానవ శరీరంలో భౌతిక పరమైన అనేక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ దృష్టి చేతనే ఈ పండగను సాంస్కృతిక పరమైన అద్భుత మహత్యము గల పర్వదినంగా మనకు పెద్దలునిర్దేశించారు.


జ్యోతిషశాస్త్ర ప్రకారంగా..


సూర్యభగవానుడు ఏ రోజైతే మకరరాశిలో ప్రవేశిస్తాడో ఆ పుణ్యఘడియలను ఆ రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలి చలిగా ఉంటుంది. నెల రోజులు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా కనబడతాయి. హరిదాసులు, బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు, రకరకాల జానపద కళాకారులు వినోద ప్రజలకు వినోదాన్ని అందిస్తారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందు నుండే ప్రతీ రోజు ఇళ్ళ ముందు అందమైన ప్రత్యేక గీతల అల్లిక ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు.


ఈ పండగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు ( నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అని అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు.


ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఉదయాన్నే నుదుటన కుంకుమ బోట్టు పెట్టుకుని, నువ్వుల నూనెను గోరువెచ్చగా కాచి దానిని ఓళ్ళంతా మర్ధన చేసుకుని, నల్ల నువ్వులను కొన్ని తలపై వేసుకుని సున్నిపిండితో ఒళ్ళురుద్దుకుని తలంటుస్నానం చేయాలి. ఈ పండగకు కొత్త అల్లులన్నీ , కూతుళ్లని ఇంటికి ఆహ్వానించుకుని కొత్త బట్టలు వేసుకుని దేవున్ని పూజించుకుని ప్రాంతాల వారిగా , కుటుంబ ఆచార, సాంప్రదాయకంగా వేడుక చేసుకుని పరమాన్నం, పిండి వంటలు, గుమ్మడి మొదలగు వాత హరములగు కూరగాయలు మొదలగునవవి భుజించి కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో ఎంతో సరదాగా గడుపుతారు.


రైతులకు పంటపోలాల నుండి ధాన్యం ఇంటికి వచ్చేకాలం ఇది. గంగిరేద్దుల విన్యాసాలు, హరిదాసులు ఇంటింటికి వచ్చి చేసే హరికీర్తనలు ఆనంద పరుస్థాయి. స్త్రీలు రకరకాల రంగులతో అందమైన ముగ్గులు ఇంటి ముందు వేసుకుని సంక్రాంతి నోములు, వ్రతాలు చేసుకుని నోములను ఇరుగు పోరుగువారికి ఆత్మీయులకు పంచుకుని దాంపత్య, కుటుంబ దోషాలను తోలగించుకుని దైవానుగ్రహం పొందామని సంతృప్తి చెందుతారు. పిల్లలు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. నోరూరించే పిండి వంటలు తీపి పదార్తలు,మొదలగు వాటిని దానం చేస్తారు.


మకర సంక్రమణం నుండి చలి క్రమక్రమంగాతగ్గుతుంది. దేహపరంగా అనేకమైన మార్పు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ పండుగ రోజున మన ఆరోగ్య పరిరక్షణ కొరకు నువ్వులకు సంభందించిన పిండి వంటలను తినడం శ్రేయస్కరం. నువ్వుండలు ( నువ్వుల ముద్దలు ) అరిశెలు, సకినాలు మొదలగు ఆహార పధార్ధాలు ఈ కాలంలో తింటే కంటికి, ఎముకలకు, చర్మమునకు, అనేకమైన ఆరోగ్య సమస్యలు నివారణ జరిగి ఆరోగ్య అభివృద్ది కలిగిస్తుంది.


సంక్రాంతి ప్రత్యేకతలు :-


1. సూర్యుడు తన కుమారుడైన శనిని కలిసే రోజు అంతే కాకుండా సూర్యుడు తన కోపాన్ని మర్చిపోయి తన కుమారుడు శనిని ఈ పండుగరోజు కలుస్తాడనే జానపదుల నమ్మకంలో ఉంది. కాబట్టి, స్వీట్లు పంచుతూ ప్రతి ఒక్కరూ ఆనందంతో గడపాలని చెప్తారు.


2. ఈ పండుగ చలికాలంలో రావడంచే నువ్వులు, బెల్లం తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వంటికి వేడిని ఇచ్చే ఆహార పదార్ధాలు కాబట్టి బంధానికి మంచి ఆరోగ్యానికి గుర్తుగా ప్రత్యేకంగా ఈ స్వీట్లను పంచుతారు.


3.గాలి పటాలు ఎగుర వేయడం వెనుక చాలా కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా పగలే ఎగరేసేవారు ఎందుకంటే అప్పుడు సూర్య కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి, చల్లని గాలికి శరీరానికి ఎక్కువ ఇబ్బందిగా ఉండదు కాబట్టి గాలిపటాలు ఎగరేసేప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్య కిరణాలు తాకుతాయి. సూర్యకిరణాలు మన శరీరానికి, చర్మానికి చాలా ఉపయోగకరం. శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది.


4. మకరజ్యోతి దక్షిణ భారతదేశ కేరళలో ఈ రోజు ప్రత్యేకమైన రోజున కష్టతరమైన కటువైన దీక్షతో మండలం రోజులు దీక్ష చేసి శబరిమల యాత్ర చేసిన భక్తులకు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చేరోజు. దేశంలో కొన్ని ప్రాంతాలలో తమ పాపాలను పోగొట్టుకోవడానికి నదుల్లో పవిత్ర స్నానాలను చేసి ఈ పండుగను జరుపుకుంటారు.


5..మకర సంక్రాంతి రోజున విధివశాత్తు మృత్యువు సంభవిస్తే వారికి పున:ర్జన్మ అనేది ఉండదు, నేరుగా స్వర్గానికే వెళ్తారని నమ్మకం కూడా ఉంది. భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్య ఘడియలు వచ్చే వరకు వేచి ఉండి ఈ పుణ్య ఘడియలలోనే ముక్తి పొందాడు.


మన ఆచార, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ మీ లోకల్ యాప్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంది.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM