మారటోరియంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

by సూర్య | Tue, Mar 23, 2021, 01:47 PM

రుణ మారటోరియం కాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపనలు ప్రకటించాలని ప్రభుత్వానికి, రిజర్వ్‌బ్యాంకుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని కూడా తెలిపింది. కరోనా మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. మారటోరియం కాలానికి రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయజాలమని, డిపాజిటర్లకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉన్నందున పూర్తి వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. అయితే, ఎలాంటి వడ్డీపై వడ్డీ విధించొద్దని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే వసూలు చేస్తే ఆ మొత్తాన్ని రుణగ్రహీతలకు సర్దుబాటు చేయాలని సూచించింది. అదే విధంగా ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని కోర్టు వెల్లడించింది. ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.


చక్రవడ్డీ మాఫీ రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలకు పరిమితం చేయడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు.. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న రుణాలపై కూడా చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. చక్రవడ్డీని మాఫీ చేయడం వల్ల బ్యాంకులపై గణనీయమైన ఆర్థిక భారం పడుతుందని, ఇది డిపాజిటర్లు, విస్తృత ఆర్థిక స్థిరత్వానికి భారీ చిక్కులు తెచ్చిపెడుతుందని ఆర్‌బిఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే ఆర్‌బిఐ ప్రకటించిన ఆరు నెలల మారటోరియం కాలానికి రుణాలు, అడ్వాన్స్‌లపై వడ్డీని వదులుకుంటే.. ఆ మొత్తం రూ.6 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని ఇది వరకే కేంద్రం సుప్రీంకు వెల్లడించింది. ఈ భారాన్ని బ్యాంకులు భరిస్తే.. దీర్ఘకాలంలో పెను భారం పడుతుందని గుర్తు చేసింది.

Latest News

 
ఆధ్యాత్మిక కేంద్రంలోతీరని డ్రైనేజీ సమస్యలు Fri, May 17, 2024, 02:56 PM
ఉప్పర సగర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు Fri, May 17, 2024, 02:55 PM
గుర్తుతెలియని వ్యక్తి మృతి Fri, May 17, 2024, 02:49 PM
చిలమత్తూరు ఎంపీపీ, మరో 35 మందిపై కేసు Fri, May 17, 2024, 02:45 PM
ఎం పి ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ Fri, May 17, 2024, 02:31 PM