వైద్య, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందిః సిఎం జ‌గ‌న్‌

by సూర్య | Fri, Oct 11, 2019, 08:27 PM

జనవరి ఒకటో తేదీన రెండువేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ పశ్చిమ గోదావరిజిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు సిఎం జ‌గ‌న్‌.  వైద్య, ఆరోగ్య రంగాలకు త‌మ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పటిష్టం చేయడంతో పాటు 108, 104 సర్వీసులను సమర్థవంతంగా నడిచేట్టు చేస్తానని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను 2022 జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో ఆధునీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. అనంతపురంలోని జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్బంగా వైయస్సార్‌ కంటివెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మూడు నెలల పాటు ఆ పైలెట్‌ ప్రాజెక్ట్ ను పరిశీలించిన తరువాత ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రతి నెలా ఒక జిల్లాలో రెండు వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. చికిత్స అందిస్తాం. రాష్ట్రం వెలుపల కూడా ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు దక్కేలా చర్యలు. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై లోని 150 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎంపిక చేసి, వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబోతున్నాం. ఇదే కాకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి  పదివేల రూపాయలు పెన్షన్‌ ఇస్తున్నామ‌ని, దీనితో పాటు తలసీమియాకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయల పెన్షన్‌ జనవరి ఒకటో తేదీ నుంచి ఇవ్వబోతున్నామ‌ని తెలిపారు. ఇవి కాకుండా మస్క్యులర్‌ డిస్ట్రోఫీ, పెరాలసిస్‌తో పాటు మరో నాలుగు రోగాలకు సంబంధించిన వారికి కూడా నెలకు 5వేల రూపాయల పెన్షన్‌ జనవరి ఒకటో తేదీ నుంచి ఇవ్వబోతున్నామ‌ని, ఆపరేషన్‌ చేయించుకున్నతరువాత పోస్ట్ ఆపరేషన్ కింద పనులు చేసుకోలేని వారికి.. వారు మెడికల్‌ రెస్ట్ తీసుకునే సందర్బంలో నెలకు రూ.5వేలు ఇస్తామ‌ని, డిసెంబర్‌ నుంచి పోస్ట్ ఆపరేటీవ్‌ కేర్‌ కింద దీనిని అమలు చేయబోతున్నామ‌న్నారు. రోజుకు రెండు వందల ఇరవై అయిదురూపాయల చొప్పున నెల లోపు ఇస్తామ‌ని,  నెల కన్నా ఎక్కువ వుంటే.. నెలకు అయిదు వేల రూపాయల చొప్పున ఎన్ని నెలల వరకు అయినా ఆ పేదలకు అందిస్తామ‌న్నారు. ఆరోగ్యశ్రీ, నెట్‌ వర్క్ ఆసుపత్రుల బకాయిలను చెల్లిస్తున్నామ‌ని, అధికారంలోకి వచ్చే నాటికి రూ. 650 కోట్ల రూపాయలు బకాయిలు వున్నామయ‌న్నారు. వీటిలో ఇప్పటికే రూ.540 కోట్లు చెల్లించామ‌ని, ఇక మిగలిన బకాయిలను కూడా క్లియర్‌ చేసుకుంటూ వచ్చి… నెట్ వర్క్‌ హాస్పటల్స్‌ లో ఊపిరి నింపుతాం. ఈ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు వుండేలా చూస్తామ‌న్నారు.  ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఆ ఆసుపత్రులకు వెడితే చిరునవ్వులతో మిమ్మల్ని రిసీవ్‌ చేసుకునే పరిస్థితిని క్రియేట్‌ చేస్తాను. గత ఐదేళ్లలో ఏ ప్రభుత్వ ఆసుప్రతిని చూసినా.. వాటి పరిస్థితిని పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గుంటూరులో అయితే చిన్నపిల్లలను ఎలుకలు కొరికిన పరిస్థితి కనిపించింద‌న్నారు. జనరేటర్లు పనిచేయక సెల్‌ఫోన్‌ లైట్లతో ఆపరేషన్లు చేసిన పరిస్థితులు మనకు కనిపించాయి.  ఇక అనంతపురం ఆసుపత్రి పరిస్థితి నేను చెప్పనక్కరలేదు. ఈ ఆసుపత్రులను మెరుగు పరిచేందుకు నాడు..నేడు అనే కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం. ప్రతి ఆసుప్రతిని ఫోటోలు తీయిస్తాం. నాడు ఎలా వున్నాయి… మారిన తరువాత ఎలా వున్నాయి అని ప్రజలకు వివరిస్తామ‌న్నారు. ఈ ఆసుపత్రులను జనవరి నుంచి రీవాంప్‌, రిపేర్లు, మెడ్రనైజేషన్‌ చేసే కార్యక్రమం చేపడుతున్నామ‌ని, జనవరి నుంచి 2022 జూన్ నాటికి పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేస్తాం. వైద్యరంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.  వైద్యం, విద్య, వ్యవసాయం… ఈ మూడు రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంద‌న్నారు.
మెడికల్‌ కు సంబంధించి సంస్కరణలు చేపట్టేందుకు ఒక కమిటీని వేశామ‌ని, ఆ కమిటీ కొన్ని సిఫారస్‌ లు చేసింది. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నామ‌న్నారు. ఇవ్వన్నీ కూడా రాబోయో రోజుల్లో మార్పులకు కారణమవుతాయి. దేవుడి దయతో..మీ అందరి చల్లని దీవెనలతో .. మీ అందరి మన్ననలను పొందే పరిస్థితి వుంటుందని, మీ బిడ్డగా ఈ వేదిక మీది నుంచి చెప్పడానికి గర్వపడుతున్నాన‌న్నారు. అనంతపురం జిల్లాకు నేను మనవడిని. అమ్మ విజయమ్మ మీ జిల్లా ఆడపడుచు. ఈ జిల్లా మనవడిగా జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తాను. హంద్రీనీవా కెనాల్‌ లో ప్రస్తుతం రెండువేల రెండువందల క్యూసెక్కుల నీళ్లు కూడా డిశ్చార్జ్‌ చేయని పరిస్థితి. ఇదే కాలువలో మెడ్రనైజేషన్‌ చేపట్టి ఆరువేల క్యూసెక్కుల నీరు పారేలా చేస్తాను. ఇదే కాలువ పక్కన మరో కాలువ లో నాలుగు వేల క్యూసెక్కుల నీరు సమాంతరంగా పారేలా పనులు చేపడతామ‌ని, మీ జిల్లా మనవడిగా… ఈ జిల్లా సమస్యలు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను. అన్ని రకాలుగా ఈ జిల్లాకు తోడుగా వుంటానని హామీ ఇస్తున్నాను. ఈ జిల్లాకు సంబంధించి దేవుడు ఆశీర్వదించాడు. పదేళ్లలో ఈ జిల్లాలో చెరువులు నిండటం చూడలేదు. గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి హయాంలో చూశాం. మళ్లీ ఇవ్వాళ ఆ నాన్నగారి బిడ్డ పరిపాలనలో చూస్తున్నామని ఇక్కడి ప్రజల చెప్పుకుంటుంటే విన్నా. మీ అందరి తోడు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు మీ బిడ్డకు ఇవ్వండి. మీ బిడ్డ మీ అందరి మన్ననలను పొందేట్లుగా పరిపాలన చేస్తారని మరోసారి ఈ వేదిక మీద నుంచి తెలియచేస్తున్నాను అన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, మంత్రి మాలగుండ్ల శంకర్‌ నారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు టి.రంగయ్య, గోరంట్ల మాధవ్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM