హ‌రిద్వార్‌లో జి.డి. అగర్వాల్ ప్రథమ వర్థంతిలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్

by సూర్య | Fri, Oct 11, 2019, 08:37 PM

గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. తాను పోరాటయాత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణవార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం త‌న‌ను తీవ్రంగా కలచివేసిందన్నారు. విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ గురువారం సాయంత్రం హరిద్వారకు చేరుకున్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన, రామన్ మొగసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్‌తో సమావేశం అయిన సందర్భంలో అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. పిలిచిన వెంటనే కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని పవన్ కళ్యాణ్ నాడు హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం వెన్నునొప్పి బాధ ఇంకా పూర్తిగా తగ్గనప్పటికీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప‌వన్ కళ్యాణ్ హరిద్వార్ వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు డెహ్రడూన్ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా హరిద్వార్‌లోని శివారు ప్రాంతంలో ఉన్న మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని జి.డి.అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపారు. ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్‌లు పవన్ కళ్యాణ్‌కు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంప్రదాయ సిద్ధమైన తలపాగను రాజేంద్రసింగ్ కట్టారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహరాజ్ పవన్‌కు వివరించారు. ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళణ కోసం అన్న పానీయాలు మాని 115 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి అసువులు బాశారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఓ సత్కార్యం కోసం ప్రాణాలు అర్పించారని శివానంద్ మహరాజ్ తెలిపారు. పవన్ గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళణ పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరారు. దక్షిణాది నుంచి గంగా ప్రక్షాళణ పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని పవన్ కళ్యాణ్ దానిని భర్తీ చేయాలని కోరారు. రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. జి.డి. అగర్వాల్‌లో ఉన్న పోరాట స్ఫూర్తిని తాను పవన్ కళ్యాణ్‌లో చూశానని అన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచిన వెంటనే పవన్ ఒక్క సెకను కూడా ఆలోచించ కుండా తాను తప్పక వస్తానని చెప్పి, ఇప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నారని అన్నారు. గంగా ప్రక్షాళణ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఆయన కోరారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM