ఆరు ద‌శ‌ల్లో వైయస్సార్‌ కంటివెలుగుఃసిఎం జ‌గ‌న్‌

by సూర్య | Fri, Oct 11, 2019, 08:09 PM

వైద్య, ఆరోగ్య రంగాలకు త‌మ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పటిష్టం చేయడంతో పాటు 108, 104 సర్వీసులను సమర్థవంతంగా నడిచేట్టు చేస్తానని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను 2022 జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో ఆధునీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. అనంతపురంలోని జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్బంగా వైయస్సార్‌ కంటివెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మన కళ్ళు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయి. కంటి విలువ ఎలాంటిది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ… పుట్టగానే అమ్మ ఎలా వుంటుందని ఆ పుట్టిన బిడ్డకు పరిచయం చేసేది ఈ కళ్ళే. అటువంటి కళ్ళకు సంబంధించి ఈ రోజు మన రాష్ట్రంలో వున్న పరిస్థితి ఏమిటీ… ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మనం ఏం చేస్తున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరికీ కలగాలి. మన రాష్ట్ర జనాభా అయిదు కోట్ల నలబై లక్షల మందిలో 2.12 కోట్ల మందికి దృష్టి పరంగా సమస్యలు వున్నాయి. ఈ సమస్యల్లో దాదాపు ఎనభై శాతం వరకు మనం కాస్త ధ్యాస పెడితే… కంటిచూపునకు సంబంధించి ఆపరేషన్లు, చికిత్స చేయించుకుంటే పూర్తిగా నయం అవుతాయి. మన రాప్ట్రంలో కంటి శుక్లాలు, చిన్నపాటి చికిత్సతో నయం చేసే సమస్యలను గత ప్రభుత్వాలు ఎప్పూడూ కూడా పట్టించుకోలేదు. ఈ దృష్టి సమస్యలకు సంబంధించి ఏ రోజు మేం ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పలేదు. అయినప్పటికీ రాఫ్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి సమస్యలను పరిష్కరించాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కంటిచూపు పరీక్షలు, చికిత్సలు చేయడానికి అక్షరాలా అయిదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గ్లోకోమా, రెటినోపతి, డయాబేటిక్ వంటి అనేక సమస్యలు, పలు శస్త్రచికిత్సలను ఉచితంగా చేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మూడు సంవత్సరాల్లో ఆరుదశల్లో…ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ప్రతి ఇంటిలోనూ వెలుగు నింపాలని, ప్రతి కంటిలో వెలుగు వుండాలనే లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతున్నాము.అక్షరాలా 5.4 కోట్ల మందికి ఒకేసారి ఈ కంటిపరీక్షలు, చికిత్సలు నిర్వహించడం అన్నది సాధ్యం కాదన్నవిషయం అందరికీ తెలిసిందే. అందుకే దీనిని దశల వారీగా చేపడుతున్నాం. మొదటి, రెండో దశల్లో కేవలం పిల్లలకు పూర్తిగా పరీక్షలు చేయడం, చికిత్సలు చేయడం జరుగుతుంది. మొదటి దశ కార్యక్రమం అక్టోబర్‌ పదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 62,489 పాఠశాలల్లో అంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న మొత్తం 70,41,988 పిల్లలకు ఈ కార్యక్రమంలో ఉచితంగా కంటి పరీక్షలు, కళ్ళజోళ్ళు, చికిత్సలు చేయిస్తాం. మొదటి దశ కింద ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూల్ లోనూ అమలు చేస్తాం. ఆశావర్కర్లు, టీచర్లు, ఎఎన్‌ఎంలు, విద్యాశాఖ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమంను ముందుకు తీసుకువెడతాం. విద్యార్ధులకు ప్రాథమిక పరీక్షలు చేయిస్తాం. ఆ తరువాత ఎవరికైనా రెండోదశ పరీక్షలు చేయించాల్సిన అవసరం వుందని నిర్దారణ అయితే… రెండో దశ కార్యక్రమం నవంబర్‌ ఒకటో తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు జరుగుతుంది. ఎవరికి అయితే చికిత్స అవసరం వుంటుందో వారికి రెండో దశలో మరోసారి పరీక్షలు చేయిస్తారు. విజన్‌ సెంటర్లలో ఈ పరీక్షలు చేయించిన తరువాత వారికి డిసెంబర్‌ 31వ తేదీ నాటికి చికిత్స, కళ్లజోళ్లు అందచేస్తాం. మొదటి రెండు దశల్లో బడి పిల్లలకు పూర్తయిన తరువాత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సాధారణ ప్రజలకు జరిపే కంటిపరీక్షలు, చికిత్సలను ఆరుదశల్లో చేస్తాం.ఒక్కో దశ ఆరునెలల పాటు జరుగుతుంది. ఒక్కో దశలో పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అవ్వా,తాతలను కూడా కవర్ చేసే కార్యక్రమం చేపడతాం. ఫిబ్రవరి ఒకటి నుంచి 2022 జనవరి ముప్పై ఒకటో తేదీ నాటికి ప్రతి ఆరు నెలలకు ఒక దశ చొప్పున రాష్ట్ర ప్రజలకు పరీక్షలు, చికిత్సలు చేయిస్తాం. అవసరం మేరకు కంటి అద్దాలను కూడా అందిస్తాం. మూడు నుంచి ఆరు దశల్లో మొత్తం ప్రజలను ఈ పరీక్షలు, చికిత్సలు చేయించే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నాం. దీనిలో గ్రామవాలంటీర్లు, ఆశావర్కర్లు, ఎఎన్‌ఎం, పిహెచ్‌సి సిబ్బంది, మెడికల్‌ సిబ్బంది, స్వచ్చంద సంస్థలను ప్రభుత్వం భాగస్వాములను చేస్తోంది. ఈ పథకం గురించి పదిమందికి చెప్పండి… ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు కంటి పరీక్షలు చేయించండి…మీరు కూడా చేయించుకోండి. మీ ఇళ్లలో… మీ కళ్లలో కాంతులు నింపడానికి… కేవలం నాలుగు నెలల కిందట అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతూ ముందడుగులు వేస్తోంద‌న్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM