ఆయ‌న పాఠాలు ఆయ‌న‌కే నేర్పుతున్న బీజేపీ!

by సూర్య | Sat, Jun 22, 2019, 09:09 PM

రెండు క‌ళ్ల సిద్ధాంతంతో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను శాసించి, ముందు ముందు శాసిస్తాన‌ని భావించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి, మూడో క‌న్ను తెరిచి అస‌లు సిస‌లు రాజ‌కీయ ఏంటో చూపిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అవ‌స‌రానికి జ‌త‌క‌ట్ట‌డం, ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు నెట్ట‌డమే చంద్ర‌బాబు రాజ‌కీయ మార్క్ సిద్ధాంతం. 1999లో కూడా మాజీ ప్ర‌ధాని వాజపేయిపై జ‌నంలో ఉన్న క్రేజ్, త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న చంద్ర‌బాబు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఊపులోనే అప్ప‌ట్లోనే అధికారం నిల‌బెట్టుకున్నారు. ఆ త‌ర్వాత పొత్తులో భాగంగా బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను త‌న‌వైపు తిప్పేసుకున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తి జిల్లాలో బీజేపీ ఎద‌గ‌కుండా, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధించారు. ఆ దెబ్బ‌తో బీజేపీ ఏపీలో కోలుకోకుండా పోయింది. ఉన్న కొద్ది క్యాడ‌ర్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చీలిపోయింది. ఇక చంద్ర‌బాబు కూడా, తాను జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోన‌నీ, త‌న‌ను క్ష‌మించాలంటూ జనాన్ని కోరారు. ఈ అనుభ‌వాన్ని, అవ‌మానాన్ని బీజేపీ అధిష్టానం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. ఇక‌ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఢీ కొట్టేందుకు సొంత బ‌లం చాల‌ద‌ని ఊహించిన చంద్ర‌బాబు, న‌రేంద్ర మోడీ వేవ్ బాగా ఉంద‌ని అర్థం చేసుకున్నారు. వెంట‌నే బీజేపీతో పొత్తుకు వెంప‌ర్లాడారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీతో కూడా దోస్తీ క‌ట్టారు. అలా 2014 ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అయ్యారు. ఆ త‌ర్వాతా త‌న మార్క్ రాజ‌కీయాన్ని తెర మీద‌కు తెచ్చారు.
2019లో మోడీ హ‌వా ఉండ‌ద‌ని భావించిన ఆయ‌న‌, మ‌హాకూట‌మి పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌తో స‌మావేశాలు జ‌రిపారు. ఇదే స‌మ‌యంలో బీజేపీతో అవ‌స‌రం తీరింద‌ని భావించి మోడీ, అమిత్ షాలపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. క్రమంగా బీజేపీకి దూరమయ్యారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన‌ టీడీపీ మూల సిద్ధాంతాన్ని తుంగ‌లో తొక్కారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. ఇక మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మోడీ నేతృత్వంలో బీజేపీ భారీ మెజార్టీ సాధించ‌డం, చంద్ర‌బాబుకు మింగుడు ప‌డ‌లేదు. దేశవ్యాప్తంగా మారిన రాజ‌కీయ ముఖచిత్రాన్ని అర్థం చేసుకోవ‌డంలో విఫ‌లమైన చంద్ర‌బాబు, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు రానున్న ఉప‌ద్ర‌వాల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలీక వ‌ణికి పోతున్నారు. ఇక త‌మ అధినేత ప‌రిస్థితే ఇలా మార‌డంతో, టీడీపీ నేత‌లు త‌మ‌దారి తాము వెతుక్కుంటున్నారు. అస‌లే సీబీఐ, ఈడీ కేసుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి బీజేపీలో చేరిపోయారు. పాటు అవ‌కాశ‌వాద రాజ‌కీయాల్లో నాలుగు ఆకులు ఎక్కువ చ‌దివిని టీ.జీ. వెంక‌టేష్, గ‌రిక‌పాటి రామ్మోహ‌నరావు కూడా కాషాయ కండువా క‌ప్పుకున్నారు. వీరిని అధికారికంగా త‌మ‌లో క‌లిపేసుకున్న బీజేపీ, రాజ్య‌స‌భ‌ వెబ్ సైట్లోలో టీడీపీ ఇద్ద‌రు ఎంపీలు ఉన్న‌ట్లుగానే మార్చేసింది. రాజ్య‌స‌భ‌లో బ‌లం పెంచుకునే ప్ర‌య‌త్నంలో బీజేపీ, ఎన్ని నింద‌లు ఎదురైనా ప‌ట్టించుకోలేదు. ఆ పార్టీ సంగ‌తి ప‌క్క‌న పెడితే, ఇప్పుడు చంద్ర‌బాబుకు ఏపీ అసెంబ్లీలో బ‌లం త‌గ్గేలా ఉంద‌ట‌. ఎందుకంటే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నేత‌లు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నార‌ట‌. వీరంతా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు నాయ‌క‌త్వంలో పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా, వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వం మీద తెలుగు త‌మ్ముళ్ల‌కు న‌మ్మ‌కం పోవ‌డం ఖాయం. అంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ కూసాలు క‌దిలిపోవ‌డం ఖాయం. ఈ ఎత్తుగ‌డ‌తోనే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ, ఏపీ రాజ‌కీయాలను ర‌స‌వ‌త్త‌రంగా మారుస్తోంది.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM