వారందరికీ రూ.3 వేలు, 25 కిలోల బియ్యం-సీఎం చంద్రబాబు

by సూర్య | Fri, Jul 26, 2024, 07:39 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో నీరు చేరి భారీగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యారు. దీంతో అక్కడ నివసించే జనజీవనం అస్తవ్యస్తం అయింది. పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలను సహాయక శిబిరాలకు తరలించింది. ఈ క్రమంలోనే వరద ప్రభావానికి గురై.. ఇళ్లు, వాకిలి వదిలేసి ప్రభుత్వ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చూపించారు.


గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల ప్రజలు వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. మొత్తం 4317 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని.. 1.06 లక్షల ఎకరాల్లో వరి నాట్లు ముంపుకు గురయ్యాయని వెల్లడించారు. ఇక మొక్కజొన్న, పత్తి లాంటి మిగితా పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందని చెప్పారు.


ఇక ఆయా జిల్లాల్లో జనం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇళ్లు నీట మునిగిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయంతోపాటు.. నిత్యావసర సరుకులు అందజేస్తామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం.. 25 కిలోల బియ్యం.. లీటర్‌ పామాయిల్‌.. కిలో చొప్పున కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అందిస్తామని ప్రకటించారు. వరద ప్రభావానికి గురైన వరద బాధితుల్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరామర్శించాలని.. వ్యవసాయ శాఖ, హోం శాఖ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.


ఇక ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం ఉందని పేర్కొన్న చంద్రబాబు.. దానికి హాజరు కానున్నట్లు తెలిపారు. ఆ కారణంగానే వరద బాధితుల్ని పరామర్శించేందుకు తాను స్వయంగా వెళ్లలేకపోతున్నానని.. అందుకే మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని ఆదేశాలిచ్చామని.. ఆ తర్వాత నివేదిక వచ్చిన అనంతరం చర్యలు చేపడతామని చంద్రబాబు.. అసెంబ్లీలో వెల్లడించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM