by సూర్య | Thu, Jul 11, 2024, 05:12 PM
విజయవాడ వన్‌టౌన్‌లోని చిట్టూరి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విజయ కాంప్లెక్సులోని ఫ్యాన్సీ వస్తువుల గోడౌన్లలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు గోడౌన్లు మంటలకు ఆహుతయ్యాయి. మరో నాలుగు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ గోడౌన్లలో అగ్నికి సులభంగా ఆహుతయ్యే వస్తువులు ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. కిక్కిరిసిన ఈ ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్లాస్టిక్ సామాన్లు, ఫ్యాన్సీ వస్తువులు, విద్యుత్ లైట్ల షాపులు, గోడౌన్లు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి. వన్‌టౌన్‌కు చెందిన గౌతంచంద్.. కేబీఎన్ కాంప్లెక్స్ ఎదురుగా మహావీర్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాపును నిర్వహిస్తున్నాడు. ఇతనికి విజయ కాంప్లెక్సులో మూడు గోడౌన్లు ఉన్నాయి. అలాగే, మరో ఏడుగురు వ్యాపారులకు గోడౌన్లు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. కాగా, గౌతంచంద్ వద్ద పనిచేసే వర్కర్ బుధవారం తన వెంట ఐదుగురు కస్టమర్లను తీసుకెళ్లి గోడౌన్లలో వస్తువులను చూపిస్తుండగా, ఒక్కసారిగా పొగ కమ్ముకుంది. వెంటనే వారంతా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో రెండు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల ఆస్తి అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. వన్‌టౌన్ సీఐ దుర్గా ధనశేఖరరెడ్డి, ఎస్‌ఐలు శారద, సతీష్, రమ్య సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి రద్దీని నియంత్రించారు.
Latest News