తిరుపతి జనసేనలో కోల్డ్ వార్.. ఏకంగా స్టేజ్ పైనే.. సేనానికి ఈ తలపోటు తప్పేదేలా?

by సూర్య | Wed, Jul 10, 2024, 09:50 PM

తిరుపతి జనసేనలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. జనసేనలోకి వచ్చిన కొత్త కాపులకు, పాత కాపులకు మధ్య విభేదాలు మరోసారి పొడచూపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నుంచి జనసేనలోకి వచ్చి.. తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులకు, జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్‌కి మధ్య ఎన్నికల ముందు నుంచే కోల్డ్ వార్ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు.. ఈ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. ఆయనకి తిరుపతి సీటు కేటాయించడంతో కిరణ్ రాయల్ వ్యతిరేకించారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కిరణ్ రాయల్‌ను బుజ్జగించారు. అధ్యక్షుడి ఆదేశంతో కిరణ్ రాయల్ కూడా ఒక మెట్టు దిగి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం కష్టపడ్డారు. అయితే, తిరుపతిలో శ్రీనివాసులు గెలిచిన తర్వాత కూడా మళ్లీ జనసేనలో ముసలం మొదలైందని టాక్.


వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఆరణి శ్రీనివాసులు.. తనతో పాటు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వారి కోసమే పనిచేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన కొందరికి పదవులు కట్టబెడుతున్నారని.. గడిచిన వైసీపీ పాలనలో పార్టీ కోసం పనిచేసిన జనసైనికులను ఇప్పుడు పట్టించుకోవడం లేదని కిరణ్ రాయల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా తిరుపతిలో కూటమి నాయకులు నిర్వహించిన వార్డు మీటింగుల్లో కిరణ్ రాయల్ తన అసంతృప్తిని బయటపెట్టారు.


బైరాగి పట్టెడలో జరిగిన కూటమి నేతల సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కిరణ్ రాయల్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది జనసైనికులపై కేసులు పెట్టారని.. అయినప్పటికీ ఎక్కడా బెదరకుండా పార్టీ కోసం పనిచేశారని.. అలాంటి వారిని ఎమ్మెల్యే గుర్తించాలని ఆరణి శ్రీనివాసులు ఎదురుగానే కామెంట్లు చేశారు. పదవులను వైసీపీ నుంచి వచ్చిన బంధువులకు కట్టబెట్టడం సరికాదని విమర్శించారు. దీన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మరోవైపు ఆరణి శ్రీనివాసులు కూడా ఎక్కడా తగ్గలేదు. పార్టీ కోసం పనిచేసిన ఎవ్వరినీ వదులుకోమని.. అందరికీ న్యాయం చేస్తామని కిరణ్ రాయల్‌కు కౌంటర్ ఇచ్చారు. కేసులు ఎందుకు పెట్టారో.. జైలుకి ఎందుకెళ్లారో తెలుసని డైరెక్ట్ ఎటాక్ చేశారు. పార్టీలో కష్టపడిన వారు ఎవరో తనకు తెలుసని ఆయన అన్నారు. ఎమ్మెల్యే.. కిరణ్ రాయల్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంతో మళ్లీ తిరుపతి జనసేన పార్టీ వర్గాలుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. మరి దీన్ని అధినేత పవన్ కళ్యాణ్ ఎలా సరిదిద్దుతారో చూడాలి.

Latest News

 
వైసీపీ ప్రభుత్వ మద్యం అక్రమాలు.. కూపీ లాగుతున్న సీఐడీ Fri, Jul 19, 2024, 04:03 PM
ప్రభుత్వ అధికారి కారు బోల్తా.. తీవ్ర గాయాలు Fri, Jul 19, 2024, 04:00 PM
శ్రీరాములమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల Fri, Jul 19, 2024, 03:58 PM
తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం: తహసిల్దార్ రత్నం Fri, Jul 19, 2024, 03:51 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు స్థిరాస్తిదారులకు మేలు Fri, Jul 19, 2024, 03:50 PM