by సూర్య | Tue, Nov 21, 2023, 07:32 PM
చిత్తూరు జిల్లాలో శ్మశానంలో అంత్యక్రియలను ఓ వీఆర్‌ఏ అడ్డుకున్నారంటూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు స్థానికులు. బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లెకు చెందిన చెంగల్రాయాచారి (60) అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి శ్మశానంలో గుంత తీసేందుకు వెళ్లగా.. వీఆర్‌ఏ గంగులప్ప, అతని సోదరుడు మణి అడ్డుకున్నారన్నారు. తన పట్టా పొందిన భూమిలో పూడ్చరాదంటూ గునపం, పార పక్కకు విసిరేశారని బాధితులు చెబుతున్నారు. అక్కడే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
అంత్యక్రియల్ని అడ్డుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు, బాధితులు మృతదేహాన్ని తీసుకుని బైరెడ్డిపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట పుంగనూరు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సదరు వీఆర్‌ఏ 28 సెంట్ల శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకుని పట్టా చేసుకున్నట్లు ఆరోపించారు. అక్రమ పట్టాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గంటపాటు రాకపోకలకు అంతరాయం కలిగడంతో.. తహసీల్దార్ కుమారస్వామి రంగంలోకి దిగారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. వీఆర్‌వో సుధ బాధితులతో మాట్లాడేందుకు వెళ్లగా వాగ్వాదానికి దిగారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యవక్తం చేవారు. శ్మశానంలోనే మృతదేహాన్ని ఖననం చేయిస్తామని వీఆర్వో సుధ, పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు.
Latest News