అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం... పంజాబ్ పోలీసుల జల్లెడ

by సూర్య | Sun, Mar 19, 2023, 06:10 PM

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీలో ఉన్నట్లు పంజాబ్‌ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అతడ్ని పట్టుకునేందుకు భారీ ఆపరేషన్‌ కొనసాగుతోందని, అరెస్ట్‌ చేసే వరకు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బైక్‌పై పారిపోతున్న అమృత్‌పాల్‌ సింగ్‌‌ను పోలీసులు 20-25 కిలోమీటర్ల దూరం వెంబడించారని, అయినా తప్పించుకుని పారిపోయాడని జలంధర్ పోలీస్ కమిషనర్ కేఎస్ చాహల్ తెలిపారు. పలు ఆయుధాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.


ఈ నేపథ్యంలో పంజాబ్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. రహదారులపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం వరకూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు. జల్లుపూర్ ఖేరా గ్రామంలోని అమృత్‌పాల్‌ సింగ్ నివాసంలో పంజాబ్ పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న విషయం తెలిసిందే. తన అనుచరులతో కలిసి అమృత్‌ పాల్‌ మోటార్‌ సైకిల్‌పై పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో కచ్చితమైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు.


అయితే, అనుమానం ఉన్న అన్ని ప్రదేశాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. తన కుమారుడ్ని లొంగిపోమ్మని చెప్పాలని అమృత్‌పాల్‌ తండ్రి టార్సేమ్ సింగ్‌కు పోలీసులు సూచించారు. జల్లూపూర్ ఖేరా గ్రామాన్ని పోలీసులు, కేంద్ర సాయుధ దళాల ఆదివారం ఉదయం చుట్టుముట్టాయి. చీమ కూడా బయటకు వెళ్లకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్థానికులు బయటి నుంచి, వారి ఇళ్ల పైకప్పులపై నుంచి పోలీసుల కార్యకలాపాలను ఆసక్తిగా చూస్తున్నారు, అయితే అమృతపాల్ గురించి లేదా అతని ఇంటిని పోలీసులు సోదా చేయడం గురించి అడిగితే మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు.


ఇప్పటి వరకు అమృత్‌ పాల్‌ అనుచరుల్లో 78 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అతని ఆర్థిక వ్యవహారాలను చూసుకునే దల్జీత్‌ సింగ్‌ కూడా ఉన్నాడు. అతణ్ని హరియాణాలోని గురుగావ్‌లో అరెస్టు చేశారు. అలాగే అమృత్‌పాల్‌కు అంగరక్షకులుగా ఉన్న మరో ఏడుగురు కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం యావత్‌ పంజాబ్‌ పోలీసు పహారాలో ఉంది. ప్రజలు సంయమనం పాటించాలని.. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


అమృత్‌పాల్‌ సింగ్ శనివారం జలంధర్‌లోని షాకోట్‌కు వస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా పోలీసులు సమాచారం అందింది. ప్రణాళిక ప్రకారం అమృత్‌పాల్‌, అతడి అనుచరులను అరెస్ట్‌ చేసేందుకు జలంధర్‌, మొగా పోలీసుల బృందం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టింది. పోలీసులు వస్తున్నారని తెలియగానే అమృత్‌పాల్‌ పారిపోయాడు. అతడి తండ్రి మాత్రం తన కుమారుడు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని తెలిపారు.


పోలీసులు తమ ఇంటిని శోధించారు కానీ, అభ్యంతరకరమైనది ఏమీ లభించలేదని టార్సేమ్ సింగ్ అన్నారు. కేవలం సిక్కు మతాన్ని ప్రచారం చేస్తూ యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రేరేపిస్తున్న తన కుమారుడిని పోలీసులు ఎందుకు వెంబడిస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘వారు (పోలీసులు) నా కొడుకు కోసం వెదికే బదులు డ్రగ్స్‌కు అలవాటుపడిన వ్యక్తులను తనిఖీ చేయడంలో తమ శక్తిని వెచ్చించాలి అని టార్సెమ్ సింగ్ చెప్పాడు. తన కొడుకు ఆచూకీ తనకు తెలియదని చెప్పాడు. ‘‘పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు. అతను (అమృతపాల్) షెడ్యూల్ ప్రకారం ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళాడు.. దారిలో పోలీసులు అతడిని వెంబడించినట్లు తెలిసింది. అంతకు మించి నాకు ఏమీ తెలీదు’’ అన్నాడు.


 


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM