ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంత డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి

by సూర్య | Sat, Mar 18, 2023, 07:48 PM

కడప నగరంలో చిన్నపాటి వర్షానికే ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పదేపదే డ్రైనేజి మురుగు నీరు రోడ్లపై తిష్ట వేస్తున్నదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ నగర నాయకులు కడప ఆర్టీసీ బస్టాండ్ తూర్పు వైపు కాంప్లెక్స్ వద్ద ప్రధాన రోడ్డుపై నిల్వ ఉన్న వర్షపు మురుగు నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ వర్షం వచ్చి పోయిన 36 గంటల తర్వాత కూడా డ్రైనేజ్ నీళ్లు ప్రధాన రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతూ పరిసర ప్రాంత ప్రజానీకానికి , వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఔట్ గేటు మొదలుకొని ఎడమవైపు జిల్లా కోర్టు వరకు ఉన్న డ్రైనేజీ కాలువ పరిసర ప్రాంతం వర్షం వచ్చిన ప్రతిసారి మురుగునీరు రోడ్లపై నిలిచి బురదతో ఇబ్బందికరంగా ఉండడం దారుణమన్నారు.


అధ్వాన్నంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను, మురుగు కాలువలను బాగు చేయడంలో కార్పోరేషన్ పాలక, అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందన్నారు. వర్షం అనంతరం రోడ్లపై మురుగునీటి బురద నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల సరసన జనం నుండి పన్నుల వసూళ్ళలో ముందంజలో ఉన్న కడప నగర పాలక యంత్రాంగం పౌర సేవలు , నగరాభివృద్ధి పనులు చేపట్టడంలో వెనకంజలో ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్టాండ్ , పరిసర ప్రాంతాలలో డ్రైనేజ్ సమస్యకు తక్షణం శాశ్వత పరిష్కార పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి యు మద్దిలేటి, నగర కార్యవర్గ సభ్యులు టక్కోలి మనోహర్ రెడ్డి, గంగా సురేష్, పగడపూల మల్లికార్జున, వడ్ల భాగ్యలక్ష్మి, వీరాంజనేయులు, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM