డీజే, ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. సీపీ ఉత్తర్వులు, ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష

byసూర్య | Tue, Oct 01, 2024, 06:56 PM

ఈ మధ్య కాలంలో డీజేల వాడకం ఎక్కువైపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా డీజేలు, క్రాకర్స్ ఉండాల్సిందే. పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి వేడుకలు, బరాత్‌లు, చివరకు చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు. ఈ డీజేల కారణంగా సౌండ్ పొల్యూషన్‌తో పాటుగా ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతోంది. చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటీవల కాలంలో డీజే సౌండ్స్ కారణంగా కొందరు హార్ట్ ఎటాక్‌ వచ్చి ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డీజేలు, క్రాకర్స్ వాడకంపై నగర సీపీ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.


నగరంలో డీజేలు, క్రాకర్స్‌పై నిషేదం విధిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల మత పెద్దలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నగరంలో డీజేలు, సౌండ్ మిక్సర్‌లు, హైసౌండ్ ఎక్యూప్‌మెంట్, క్రాకర్స్‌పై నిషేదం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టులకు 100 మీటర్ల వరకు నిషేదం అమల్లో ఉంటుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. బీఎన్ఎస్ చట్టం ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష, ఫైన్ కూడా విధిస్తామని హెచ్చరించారు.


మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు, టపాసుల వాడకంపై సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన సెప్టెంబర్ 26న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలతో పాటు ఆయా పార్టీల ప్రతినిధులు, ఇతర మత సంఘాలు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గడిచిన పదేండ్లలో డీజేల వాడకం భారీగా పెరిగిందని సీపీ ఆనంద్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో డీజేలపై నిషేధం అమల్లో ఉందని.. అందుకే తక్కువ ధరకు హైదరాబాద్‌ వచ్చి డీజేలు పెడ్తున్నారన్నారు.


వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ వంటి మతపరమైన ఉత్సవాల్లోనే కాకుండా ఫంక్షన్ హాల్స్, ఇళ్లల్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లలోనూ డీజేలు వాడుతున్నారన్నారు. దీంతో డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయని చెప్పారు. డీజే సౌండ్స్ కారణంగా విద్యార్థులు చదువుకోలేక పోతున్నారని.. చిన్న పిల్లలు, వృద్ధుల గుండె ఆగిపోయేలా ఉందంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. డీజేలు ఉన్న ర్యాలీల బందోబస్తుకు వెళ్లాలంటే పోలీసులు సైతం వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. డీజేలు, క్రాకర్స్ నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ మేరకు వారి సూచనలు, సలహాలు స్వీకరించి తాజాగా వాటిపై నిషేదం విధించారు.



Latest News
 

గుడిహత్నూర్ ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డుప్రమాదం Tue, Oct 01, 2024, 07:32 PM
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి Tue, Oct 01, 2024, 07:28 PM
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి Tue, Oct 01, 2024, 07:28 PM
ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్‌ Tue, Oct 01, 2024, 07:27 PM
రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ Tue, Oct 01, 2024, 07:12 PM