byసూర్య | Sat, Jun 22, 2024, 08:32 PM
2018 శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఆయనపై పోటీచేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, ఈ కేసులో అడ్వొకేట్ కమిషన్ ముందు హాజరు కావాలని ఎంపీ బండి సంజయ్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఒకవేళ, అడ్వొకేట్ కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వని పక్షంలో ఎన్నికల పిటిషన్‌ను మూసివేస్తామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
2018 ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) అభ్యర్థిగా గంగుల కమలాకర్.. బీజేపీ తరఫున బండి సంజయ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గంగుల విజయం సాధించగా.. ఈ ఎన్నిక చెల్లదని 2019లో బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇరుపక్షాల సాక్ష్యాల నమోదుకు రిటైర్డ్ జిల్లా జడ్జి కె.శైలజను అడ్వొకేట్ కమిషన్‌గా నియమించింది. అయితే, ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి బండి సంజయ్ చాలాసార్లు వాయిదాలు తీసుకున్నారు. ఈ అంశంలో ఆయనకు హైకోర్టు జరిమానా కూడా విధించింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. బండి సంజయ్ తరఫు హాజరైన లాయర్.. పిటిషనర్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని, మరికొంత గడువు కావాలని కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాధారాణి.. అడ్వొకేట్ కమిషన్ ముందు హాజరు కావడానికి బండి సంజయ్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఒకవేళ హాజరుకాని పక్షంలో ఈ పిటిషన్‌పై విచారణను ముగిస్తామని పేర్కొన్నారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.