ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు

byసూర్య | Thu, May 02, 2024, 08:14 PM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్ల పలువురు మావోలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా.. మంగళవారం ఉదయం అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇప్పటివరకూ ఎనిమిది మందిని గుర్తించగా.. అందులో ముగ్గురు తెలంగాణ వాసులు ఉన్నట్లు గుర్తించారు. వారిని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామానికి చెందిన జోగన్న అలియాస్‌ ఝిస్సు అలియాస్‌ చీమల నర్సయ్య (66), మంచిర్యాల జిల్లావాసి వినయ్‌ అలియాస్‌ కేశబోయిన రవి (55), వరంగల్‌ జిల్లాకు చెందిన సుష్మిత అలియాస్‌ చైతె (26)గా పోలీసులు గుర్తించారు.


ఈ ముగ్గురు చాలాకాలంగా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో పనిచేస్తున్నారు. స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోగన్నపై 196 కేసులు ఉన్నాయి. ప్రభుత్వం ఆయనపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు డివిజనల్‌ కమిటీ సభ్యుడైన రవిపై రూ.8 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యురాలైన తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డును ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో మావోయిస్టుల ఉద్యమం బలహీనపడగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు వరుసగా మరణించటంపై మావోయిస్టు పార్టీలో ఆందోళన మెుదలైంది.


పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన చీమల నర్సయ్య అలియాస్‌ జోగన్న గోండియా ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో దళంలోని సభ్యురాలిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ మృతుల్లో నర్సయ్య భార్య సైతం ఉన్నట్లు సమాచారం. మరో మావోయిస్టు వినయ్ స్వస్థలం హనుమకొండ కాగా.. తండ్రి రాజయ్యకు సింగరేణిలో ఉద్యోగం. దీంతో వినయ్ మంచిర్యాల జిల్లా బెలంపల్లిలోనే పెరిగారు. తిక్క సుష్మిత స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సుబ్బయ్యపల్లి. 2016లో ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే ఆమె మావోయిస్టు దళంలో చేరింది. ఆమె తండ్రి సుధాకర్‌ కూడా గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చారు.



Latest News
 

మైనంపల్లి రోహిత్‌కు షాక్.. Fri, May 17, 2024, 12:45 PM
త్వరలో సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణ Fri, May 17, 2024, 12:39 PM
కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వము: మాజీ ఎమ్మెల్యే సతీశ్ Fri, May 17, 2024, 12:13 PM
ఐదు రోజుల్లో వడ్లు అన్ని పోయేలా చర్యలు తీసుకుంటున్నాం Fri, May 17, 2024, 12:01 PM
రోడ్లపై పశువులతో ప్రజల పరేషాన్ Fri, May 17, 2024, 12:00 PM