ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గ్రీన్ నెట్స్.. ఎంత ‘కూల్’ ఆలోచన!

byసూర్య | Thu, May 02, 2024, 07:18 PM

నగరాల్లో జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. జనాభాతోపాటు వాహనాలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. ప్రతీ ఇంట్లో 2, 3 ద్విచక్రవాహనాలు.. ఒకటో రెండో కార్లు ఉంటున్నాయి. దీంతో అవన్నీ రోడ్లపైకి రావడంతో నిత్యం నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఇక సిగ్నల్ పడినపుడు వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రస్తుత ఎండాకాలంలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.


పగటి ఉష్ణోగ్రత ఏకంగా 45 డిగ్రీలు దాటిపోతుండటంతో ప్రజలు ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. ఇక రోడ్లపై వెళ్లే వాహనదారుల సంగతి మరీ దారుణం. పైన సూర్యుడి ఎండ, కింద రోడ్డు వేడి, పక్క నుంచి వాహనాల వేడితో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిగ్నల్ పడినపుడు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలకు పుదుచ్చేరి ప్రభుత్వం ఓ మంచి పరిష్కారం కనుగొంది.


ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కొద్ది దూరం పైన ఆకుపచ్చ బట్టను కట్టింది. దీని వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఎండ నేరుగా వాహనదారులపై పడకుండా గ్రీన్ క్లాత్ ఆపుతుంది. అంతేకాకుండా ఎర్రటి ఎండలో కాస్త చల్లదనంగా కూడా ఉంటుంది. ఇలా సిగ్నళ్ల వద్ద నాలుగు వైపులా అధికారులు వాహనాలు ప్రయాణించే మార్గంలో పైన ఆకుపచ్చ నెట్‌లను కట్టి ఉంచారు. పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్-పీడబ్య్యూడీ.. ఈ బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.


ఇది చూసిన వాహనదారులు.. నగరంలో ప్రయాణిస్తుంటే మధ్యాహ్నం పూట ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం దక్కుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన వచ్చి దాన్ని అమలు చేసినందుకు పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు థ్యాంక్స్ చెబుతున్నారు. వేసవి కాలంలో దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఇలాంటి విధానాన్నే పాటించాలని సూచిస్తున్నారు.


ఇది చూసిన హైదరాబాద్ నగర వాసులు తమకు కూడా ఇలాంటి గ్రీన్ నెట్స్ తీసుకురావాలని కోరుతున్నారు. నగరంలో రద్దీగా ఉండే సిగ్నళ్ల వద్ద అన్ని వైపులా ఇలాంటి ఆకుపచ్చ తెరలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్ఎంసీ అధికారులను ట్యాగ్ చేస్తూ.. పుదుచ్చేరి వీడియోలను షేర్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఇలాంటి విధానం తీసుకువస్తే వాహనదారులకు మండుటెండల నుంచి కాస్త ఊరట కలుగుతుందని పేర్కొంటున్నారు.


Latest News
 

ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే Fri, May 17, 2024, 03:32 PM
కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ Fri, May 17, 2024, 03:31 PM
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు Fri, May 17, 2024, 03:30 PM
వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం Fri, May 17, 2024, 02:55 PM
మహబూబాబాద్ లో అశోక్ ప్రచారం.. భారీ స్పందన Fri, May 17, 2024, 02:50 PM