తిరుమలలో సామన్య భక్తులు ఆవేదన...

by సూర్య | Wed, Oct 07, 2020, 12:30 PM

'ఏడుకొండల వాడా... ఎక్కడున్నావయ్యా...' అంటూ సామన్య భక్తులు ఆవేదన చెందుతున్న పరిస్థితి తిరుమలలో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కొండపై ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. కరోనా నిబంధనల పేరు చెప్పి, సర్వదర్శనాన్ని నిలిపివేయడమే ఇందుకు కారణం. కరోనా కారణంగా ఆలయం మూతపడటానికి ముందు రోజు వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా, నిరుపేద సామాన్య భక్తులకు ఉచిత దర్శనం కల్పించిన టీటీడీ, తిరిగి ఆలయాన్ని తెరిచిన తరువాత మాత్రం సామాన్యుల ఊసు మరచిపోయిందని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.


మహమ్మారి విస్తరించక ముందు తిరుమల గిరులు నిత్యమూ లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉండేవి. రోజుకు దాదాపు 50 వేల మందికి ఉచిత దర్శనం లభించేది. ఇప్పుడు మాత్రం సప్తగిరులపై వేలాది మంది మాత్రమే కనిపిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు గుమికూడుతున్నారన్న కారణాన్ని సాకుగా చూపుతూ, సెప్టెంబర్ 6 నుంచి ఉచిత దర్శన టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిరుపేదలకు స్వామి దర్శనం దుర్లభమైంది.


ప్రస్తుతం తిరుమలలో స్వామిని దర్శించుకోవాలంటే, కనీసం రూ.300 టికెట్ కొనాల్సిందే. ఈ ప్రత్యేక దర్శనం టికెట్లను రోజుకు 16 వేల కోటాను విడుదల చేస్తున్న టీటీడీ, వాటిని ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. ఆపై శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 10 వేలు విరాళం ఇచ్చిన వారికి, రూ. 1000తో కల్యాణం చేయించుకున్న వారికి, బోర్డు సభ్యులు సిఫార్సు చేస్తే, రూ. 300పై సుపథం ద్వారా భక్తులను స్వామి దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. అంటే ఎంతో కొంత డబ్బు వెచ్చించనిదే ఆపద మొక్కులవాడిని దర్శించుకునే వీలు లేదన్నమాట.


అలాక్కూడా రోజుకు దాదాపు 20 వేల మంది వరకూ స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్న అధికారులు, ఆన్ లైన్ లో మరిన్ని టికెట్లను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు టీటీడీపై విమర్శలకు కారణం అవుతోంది. సామాన్యులకు పెద్దపీట వేస్తామని చెప్పే పాలకమండలి, ఇప్పుడు వారి వంకైనా చూడటం లేదని పలువురు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM