కష్టాల్లో దక్షిణాఫ్రికా 275 ఆలౌట్‌...

by సూర్య | Sat, Oct 12, 2019, 05:33 PM

మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లేర్‌ చేసిన కోహ్లి సేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్‌ చేసింది. 36/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ జట్టును భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు వికెట్లతో రాణించాడు. ఉమేష్‌ యాదవ్‌ మూడు, మహ్మద్‌ షమీ రెండు, జడేజా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.  ఇక భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (64), డికాక్‌ (31), బ్రూయెన్‌ (30) మినహా మిగతా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే, 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్‌ మహరాజ్‌, ఫిలాండర్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్‌ మహరాజ్‌ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్‌ (164 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) పోరాటంతో సఫారీ జట్టు ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. నిర్ణీత సమయం ముగియడంతో మూడోరోజు ఆటకు విరామం ఇచ్చారు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉంది. మార్నింగ్‌ సెషన్‌ మొదలైన కొద్దిసేపటికే మహ్మద్‌ షమీ నూర్జే (3)ని ఔట్‌ చేశాడు. దీంతో 41 పరుగుల వద్ద పర్యాటక జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్లను వెంటవెంటనే పెవిలియన్‌ చేర్చి హడలెత్తించిన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ క్రీజులో కుదురుకున్న బ్రూయెన్‌ (30 పరుగులు, 58 బంతులు, 6 ఫోర్లు)ను ఔట్‌ చేశాడు. ఇక ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తలకెత్తుకున్న క్వింటన్‌ డికాక్‌, కెప్టెన్‌ డుప్లెసిస్‌ జోడీని అశ్విన్‌ విడగొట్టాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో డికాక్‌ (48 బంతుల్లో 31; 7 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో డుప్లెసిస్‌-డికాక్‌ హాఫ్‌ సెంచరీ భాగస్వామానికి తెరపడింది. అప్పటికీ జట్టు స్కోరు 128/6. ఇక ఏడో వికెట్‌గా ముత్తుసామి (20 బంతుల్లో 7 పరుగులు)ని జడేజా ఎల్బీగా వెనక్కు పంపాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (117 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్‌) నిదానంగా ఆడుతూ పరుగులు రాబడుతున్న క్రమంలో అశ్విన్‌ వేసిన చక్కని బంతికి అతను కూడా పెవిలియన్‌ చేరక తప్పలేదు. కేశవ్‌ మహరాజ్‌ తొమ్మిదో వికెట్‌గా, రబడ పదో వికెట్‌గా పెవిలియన్‌ చేరారు. 

Latest News

 
ఎం పి ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ Fri, May 17, 2024, 02:31 PM
మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల Fri, May 17, 2024, 02:30 PM
కారు ఇంజిన్‌ వేడెక్కి దగ్ధం Fri, May 17, 2024, 02:25 PM
ధాన్యం కొనుగోళ్లు డబ్బులు చెల్లించాలి Fri, May 17, 2024, 02:24 PM
తాడిపత్రిలో రాళ్లదాడి, నిందితులకు 14 రోజులు రిమాండ్‌ Fri, May 17, 2024, 02:23 PM