ఎన్నికల్లో 35 ఏళ్లుగా ప్రచారం.. తొలిసారి నా కోసం.. ప్రియాంక గాంధీ ఎమోషనల్

by సూర్య | Wed, Oct 23, 2024, 11:43 PM

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలీ, వయనాడ్ నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ.. రెండు చోట్ల విజయం సాధించడంతో నిబంధనల ప్రకారం ఒక్క స్థానానికే ప్రాతినిధ్యం వహించాలి. దీంతో ఆయన వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామ చేయడంతో ఉప-ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని అభ్యర్ధిగా ప్రకటించారు. బుధవారం ప్రియాంక గాంధీ నామినేషన్‌కు ఆమె తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు సహా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు తరలివచ్చారు.


రోడ్‌షోగా వెళ్లి.. ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకు ముందు ఆమె రోడ్‌షోలో మాట్లాడుతూ.. వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు. వయనాడ్ నుంచి తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు. రాజకీయాల కోసం తాను ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్‌కు వచ్చానని తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమని, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.


ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు తన సోదరుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటించినట్లు చెప్పారు. వయనాడ్ ప్రజలకు అండగా ఉండేందకు తాను ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు. వారితో కలిసి పోరాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి.. ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.


తాను 35 ఏళ్లుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నానని, ఇప్పుడు తొలిసారి నా కోసం ప్రచారం చేస్తున్నానని అన్నారు. ‘నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు 1989లో మొదటిసారి నా తండ్రి రాజీవ్ గాంధీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.. అప్పటి నుంచి 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో నా తల్లి, నా సోదరుడు సహా కాంగ్రెస్ సహచరులు కోసం ప్రచారం చేస్తూనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మొదటిసారి నా కోసం ప్రచారం చేసుకుంటున్నాను.. వయనాడ్‌లో యూడీఎఫ్ అభ్యర్ధిగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు.. మద్దతుగా నిలిచిన నా కుటుంబసభ్యులకు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను.. మీరు నాకు అవకాశం ఇస్తే మీ తరపున ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను’ అని వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా వయనాడ్ విలయంపై మాట్లాడారు. తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి తాను ముండక్కయి, చురాల్‌మలలో పర్యటించి, బాధితుల కష్టాన్ని ప్రత్యక్షంగా చూశానని భావోద్వేగానికి గురయ్యారు. ‘ఆ విధ్వంసాన్ని నా కళ్లతో చూశాను. కుటుంబాలను కోల్పోయిన పిల్లలను చూశాను. పిల్లలను కోల్పోయిన తల్లులను కలిశాను. జీవితాన్ని కోల్పోయిన వ్యక్తులను నేను కలిశాను. నేను కలుసుకున్న ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఎటువంటి భయం లేకుండా ధైర్యంతో సహాయం చేసుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.. అలాంటి మీలో భాగమవ్వడం నాకు గొప్ప వరం’ అని పేర్కొన్నారు. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నవంబరు 13న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.


Latest News

 
దూసుకొస్తున్న తుఫాన్.. Thu, Oct 24, 2024, 07:15 PM
జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ముంబయిలో భేటీ Thu, Oct 24, 2024, 07:14 PM
వెన్నునొప్పి వేధిస్తోందా.. ఈ విషయాలు తెలుసుకోండి Thu, Oct 24, 2024, 06:49 PM
కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం అమలు చేస్తారు: మంత్రి Thu, Oct 24, 2024, 06:46 PM
వారిపై చర్యలు తీసుకోవాలి: చందు నాయక్ Thu, Oct 24, 2024, 06:45 PM