ట్రైనింగ్‌లోనే రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారిణి.. వామ్మో మేడం కోరికలు మామూలుగా లేవుగా

by సూర్య | Wed, Jul 10, 2024, 09:55 PM

మన దేశంలోనే అత్యున్నత ఉద్యోగాలు అనగానే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ గుర్తుకువస్తాయి. ఈ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన వారు.. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తారు. ఇక ఐఏఎస్ అంటే లంచాలు, హంగులు, ఆర్భాటాలకు లొంగకుండా.. తమ విధి నిర్వహణ కోసం కట్టుబడి ఉంటారు. అయితే అక్కడక్కడా కొందరు ఐఏఎస్‌లు.. ఇలాంటి వాటిపై ఎక్కువగా దృష్టిసారిస్తూ దొరికిపోతూ ఉంటారు. కానీ ఈ ఐఏఎస్ మాత్రం వాళ్లకంటే డిఫరెంట్. ఎందుకంటే ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్నప్పటి నుంచే.. వీఐపీ స్టేటస్ కోసం పట్టుబట్టింది. అధికార వాహనానికి ఉపయోగించే నెంబర్ ప్లేటు, తన సొంత కారుకు లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా.. తనకు ప్రత్యేకంగా ఛాంబర్ కావాలంటూ డిమాండ్ చేశారు. ఇవే కాకుండా మరిన్ని గొంతెమ్మ కోరికలు కోరడంతో ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.


2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన డాక్టర్ పూజా ఖేద్కర్‌‌.. మహారాష్ట్ర పూణేలో ప్రొబేషనరీ ఐఏఎస్‌గా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో పూణే నుంచి వాషిమ్‌కు బ‌దిలీ అయ్యారు. ప్రొబేషనరీ పీరియడ్‌లో భాగంగా మిగిలిన శిక్షణ ప‌ద‌వీకాలాన్ని వాషిమ్‌లోనే పూజా ఖేద్కర్ పూర్తి చేయ‌నున్నారు. పూణే కలెక్టర్‌ డాక్టర్‌ సుహాస్‌ దివాసే.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడంతో.. ఆమెను 2025 జూలై 30 వ తేదీ వరకు వాషిమ్‌లో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.


ట్రైనీ ఐఏఎస్ అధికారిణి అయిన పూజా ఖేద్కర్.. పూణే క‌లెక్టరేట్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో అనేక అధికార దుర్వినియోగానికి పాల్పడిన‌ట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఆమె త‌న సొంత ఆడీ కారుకు వీఐపీ నంబర్ ప్లేట్‌ పెట్టుకున్నారు. ఆ కారుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ కూడా వేసుకున్నారు. అంతేకాకుండా జిల్లా అదనపు కలెక్టర్ అజయ్ మోరే అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె తన కార్యాలయంగా చేసుకున్నారు. ఆ ఛాంబర్‌లో తన నేమ్‌ప్లేట్‌ పెట్టుకున్నారు. ఇక అక్కడ ఉన్న కుర్చీలు, సోఫాలు సహా ఫర్నీచర్‌ను తొలగించారు.


ఇవేకాకుండా తన పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్స్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌కు కూడా పూజా ఖేద్కర్ ఆదేశాలు జారీ చేశారు. పూజా ఖేద్కర్ తండ్రి కూడా రిటైర్డ్ ఐఏఎస్ కావడంతో.. తన కుమార్తెకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కార్యాలయంలోని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని.. లేకపోతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ట్రైనీ ఐఏఎస్‌కు అలాంటి సౌకర్యాలేమీ ప్రభుత్వం కల్పించదని తెలిసినప్పటికీ వారు ఆ డిమాండ్లు చేయడం గమనార్హం.


ఇక 2023 యూపీఎస్సీ ప‌రీక్షలో పూజా ఖేద్కర్ ఆల్ ఇండియా 841 ర్యాంక్ సాధించారు. మరోవైపు.. ఈ ఘటనపై స్పందించిన ఓ ఆర్‌టీఐ కార్యకర్త.. పూజా ఖేద్కర్‌ నియామకంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్‌ కోటాలో పూజా ఖేద్కర్‌ ఐఏఎస్‌ అధికారిణిగా ఎంపికయ్యారని.. అయితే ఆమె తండ్రికి రూ.40 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు నాన్‌-క్రిమిలేయర్‌ కిందకు ఎలా వస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా పూజా ఖేద్కర్‌కు మానసిక సమస్యలు ఉన్నాయని.. ఉద్యోగంలో చేరే ముందు మెడికల్‌ టెస్ట్‌లకు కూడా ఆమె హాజరుకాలేదని సంచలన ఆరోపణలు చేశారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM