మత్స్యకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిశ్చింతగా..!

by సూర్య | Wed, Jul 10, 2024, 08:20 PM

ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. పాలనలో ప్రక్షాళన తీసుకువస్తోంది. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సముద్రంలోకి చేపలవేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారులను అప్రమత్తం చేయడం సహా వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందుకోసం చేపలవేటకు వెళ్లే పడవలకు శాటిలైట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 20 వేల వేట పడవలు ఉన్నాయని, వాటిలో తొలుత 4 వేల పడవలకు శాటిలైట్ సిస్టమ్‌ను పెడుతున్నట్లు చెప్పారు. దశలవారీగా మిగిలిన పడవలకు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.


విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో శాఖ మీద అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతోందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసలు మత్స్యశాఖ అనేది ఉందా అనే రీతిలో తయారుచేశారని విమర్శించారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్న అచ్చెన్న.. రూ.10 కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలన్న మంత్రి.. మత్స్యశాఖ అభివృద్ధి విషయంలో కేరళ, గుజరాత్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు


అలాగే చేపల వేటను నిషేధించిన సమయంలో మత్స్యకారులను అందించే మత్స్యకార భృతిపై సర్వే చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వంలో చాలా చోట్ల అనర్హులకు అందించారన్న అచ్చెన్నాయుడు..లబ్ధిదారులపై రీసర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారని అచ్చెన్న ఆరోపించారు. మరోవైపు 2014- 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ అమలు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM