వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా

by సూర్య | Fri, Apr 26, 2024, 07:47 PM

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి రాజీనామా చేసే నేతల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర సందర్భంగా పలువురు ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరుతూ వచ్చారు. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్‌ జగన్‌కు పంపించారు.


మరోవైపు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తాడికొండ ఎమ్మెల్యేగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి మరోసారి గెలుపొందిన డొక్కా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ తరుఫున ఎమ్మెల్సీ అయ్యారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల బిల్లుల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అలాగే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానంలోనే తిరిగి ఎన్నికయ్యారు.


 అయితే 2024 ఎన్నికల్లో తాడికొండ నుంచి మరోసారి పోటీ చేయాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ భావించారు. తాడికొండ లేదా ప్రత్తిపాడు ఏదో ఒకస్థానంలో బరిలో ఉండాలని భావించారు.అయితే ఈ సీటును వైఎస్ జగన్.. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితకు కేటాయించారు. ఆమె అక్కడి నుంచి నామినేషన్ కూడా దాఖలు చేశారు. వైసీపీ అధిష్టానం నిర్ణయంతో పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అయితే సీఎం జగన్ నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు మాత్రం హాజరయ్యారు.


ఈ క్రమంలోనే శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనేదీ ఆసక్తికరంగా మారింది. తిరిగి టీడీపీలో చేరతారా లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా.. లేదా ఏదైనా జాతీయ పార్టీలో చేరతారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన మళ్లీ టీడీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM