పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ

by సూర్య | Thu, Apr 25, 2024, 08:08 PM

ఏపీలో పింఛన్ల పంపిణీకి సమయం దగ్గరపడుతోంది. మే ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో పింఛన్‌దారుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిపివేశారు. దీంతో ఏప్రిల్ నెలలో గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ చేశారు. మరి మే నెలలో పరిస్థితి ఏంటా అని పింఛన్ దారుల్లో ఆందోళన నెలకొంది. ఎండల తీవ్రత కారణంగా పింఛన్ తీసుకునేందుకు సచివాలయాల వద్దకు వెళ్లిన వృద్ధులు మరణించిన ఘటనలు కూడా ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అనే సందేహాలు పింఛన్ దారుల్లో వ్యక్తమవుతున్నాయి.


ఈ క్రమంలోనే ఏపీలోని పింఛన్‌దారులకు మే నెల పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఆ పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్నికల సంఘం అధికారులకు అందజేశారు. పింఛన్ల పంపిణీకి సమయం దగ్గర పడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి చర్యలు ఏవీ కనిపించడం లేదని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.


ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని ఏప్రిల్ నెలలో పింఛన్ దారులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయకపోవటంతో 33 మంది వృద్ధులు ఎండవేడిమి కారణంగా చనిపోయినట్లు తెలిపారు. వైసీపీ దుర్మార్గపు ఆలోచనలతో, రాజకీయ ప్రయోజనాల కోసం పింఛన్ దారులు, వృద్ధుల జీవితాలతో ఆడుకోవటం సరికాదని అన్నారు. ప్రభుత్వ కార్యదర్శి జవహర్‌రెడ్డి జగన్‌ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.


మే నెల పింఛన్ల పంపిణీకి ఇంకా ఐదురోజులే ఉందన్న టీడీపీ అధినేత..గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున రెండు రోజుల్లో ఇళ్లవద్దనే పింఛన్లు పంపిణీ చేయవచ్చని అన్నారు. ఇళ్లవద్దే పింఛన్ అందిస్తామనే సమచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే 62వేల మంది వాలంటీర్లతో రాజీనామా చేయించి..వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఉన్న అపరిమిత అధికారాలను ఉపయోగించి.. వాలంటీర్లుగా చేసిన వారు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM