చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ

by సూర్య | Thu, Apr 25, 2024, 07:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నవారిపై నిందలు వేస్తూ హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం తగునా అంటూ ప్రశ్నించారు. 'నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నకే ఇలా జరిగింది' అంటూ లేఖలో ప్రస్తావించారు.


2009లో జగన్‌ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారని.. 2019లో సునీత కూడా తండ్రిని పోగొట్టుకుని అంతే నోవేదన అనుభవించారని చెప్పారు సౌభాగ్యమ్మ. 'మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం మరింత బాధపెట్టింది. నీ పత్రిక, టీవీ ఛానల్‌, పార్టీ వర్గాలు తీవ్రరూపంలో మాట్లాడారు. చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా' అని ప్రశ్నించారు. 'నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


'న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడేస్థాయికి దిగజారుతున్నా నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలనూ టార్గెట్‌ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి?. కుటుంబసభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం కల్పించడం. ఇది సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్‌ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని వేడుకుంటున్నా' అంటూ లేఖ రాశారు సౌభాగ్యమ్మ.


అటు పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకముందు జరిగిన సభలో వైఎస్ షర్మిల, సునీత రెడ్డిలు టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన నిందితుడికి మద్ధతిస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? .. అవినాష్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? అవినాష్‌రెడ్డి ఏ తప్పు చేయలేదు.. అవినాష్‌రెడ్డి జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. వైఎస్ అవినాష్ ఏ తప్పూ చేయలేదని నమ్ముతున్నా.. వైఎస్ఆర్ పేరు చెరిపేసే కుట్ర జరుగుతోందన్నారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM