శ్రీరామనవమి వేళ అయోధ్య ఆలయానికి టీటీడీ గిఫ్ట్

by సూర్య | Sun, Apr 14, 2024, 05:30 PM

కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం జనం పోటెత్తుతుంటారు. ఎక్కడెక్కడి నుంచి రోజూ వేలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వస్తుంటారు. ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా టీటీడీ ఆధ్వర్యంలో కోట్ల మంది భక్తులు శ్రీవారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకుని వెళ్తున్నారు. మరోవైపు వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలోనూ రాముడు కొలువుదీరాడు. అయోధ్య గర్భాలయంలో కొలువైన బాలరాముడి దర్శనం కోసం కూడా భక్త జనం భారీగా తరలివస్తున్నారు.


ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చేయాల్సిన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు టీటీడీ సాయం కోరింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం ఫిబ్రవరి నెలలో అయోధ్యను సందర్శించింది. అక్కడ పరిస్థితిని పరిశీలించింది. తాజాగా శనివారం రోజు అయోధ్యలో రామాలయ నిర్వహణపై సాంకేతిక సలహాల నివేదికను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందించింది.


శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యను సందర్శించింది. రామాలయ నిర్వహణ, యాత్రికులకు కల్పించవలసిన సౌకర్యాలు వంటి అంశాలపై ఇంజనీరింగ్ అధికారుల బృందం తయారు చేసిన సాంకేతిక సలహాలతో కూడిన నివేదికను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులకు అందజేశారు.భక్తుల అధిక రద్దీ సమయాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యూలైన్ల నిర్వహణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీటి కుళాయిల ఏర్పాటు, తదితర అంశాలను ఈ నివేదికలో పొందుపరిచారు. అలాగే ఆలయ నిర్వహణపై టీటీడీ అధికారుల బృందం సమగ్ర నివేదికను అందించింది.


ఆ తర్వాత టీటీడీ ఈవో, అధికారుల బృందం అయోధ్య శ్రీ రాములవారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెంట టీటీడీ సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి సహా ఇంకొంతమంది అధికారులు ఉన్నారు. మరోవైపు శ్రీరామనవమి పర్వదినం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి టీటీడీ అందించిన నివేదిక ఉపయోగపడుతుందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

Latest News

 
ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది Mon, Dec 02, 2024, 05:02 PM
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది Mon, Dec 02, 2024, 05:01 PM
సోషల్ మీడియా కార్యకర్తలకు సెక్షన్ 111 వర్తించదన్న పొన్నవోలు Mon, Dec 02, 2024, 04:56 PM
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు తో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ Mon, Dec 02, 2024, 04:20 PM
పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి Mon, Dec 02, 2024, 04:18 PM