జగన్‌‌పై జరిగిన రాళ్లదాడిపై స్పందించిన షర్మిల

by సూర్య | Sun, Apr 14, 2024, 04:34 PM

తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. సీఎం జగన్‌పై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమని షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా దాడికి చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందేనని ఆమె అన్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని భావిస్తున్నానని, సోదరుడు జగన్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


‘ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌పై దాడి జరిగి ఎడమకంటిపైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం.. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం.. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరూ ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ఖండించాల్సిందే... ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే.. జగన్‌గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో షర్మిల పోస్ట్ పెట్టారు.


మరోవైపు, సీఎం జగన్‌పై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని.. ఈ దాడి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మమతా బెనర్జీ ఎక్స్‌లో పోస్ట్‌లు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదని పేర్కొన్నారు.


మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు చేయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోలేక భయంతో జగన్‌పై రాయి దాడి చేయించారని మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టి నిందితులు, దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM