|
|
byసూర్య | Wed, Oct 08, 2025, 06:09 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు ఓటరు కార్డులు పంపిణీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఓటరు కార్డులను పంపిణీ చేయడంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు గాను అతనిపై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ, ఆయన కేవలం కాంగ్రెస్ నాయకుడే కాకుండా, ఉప ఎన్నికల్లో టిక్కెట్‌ను కూడా ఆశిస్తున్నారని, అలాంటి వ్యక్తి పంపిణీ చేయడమేమిటని ప్రశ్నించారు. గుర్తింపు కార్డులు, ఓటరు కార్డులు పంపిణీ చేయడానికి ఆయనకు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లేదా నవీన్ యాదవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇటీవల ఓట్ చోరీ గురించి ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఇది దాని కంటే పెద్ద నేరమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.