![]() |
![]() |
byసూర్య | Fri, Jun 13, 2025, 08:36 PM
నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు త్వరగా జరగాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ఆదేశించారు. నాలాల్లో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నాలా ఆక్రమణలుంటే వెంటనే తొలగించాలన్నారు. శుక్రవారం చింతల్‌బస్తీ మీదుగా సాగే బుల్కాపూర్ నాలా విస్తరణ పనులను శుక్రవారం పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12, పింఛను ఆఫీసు దగ్గర 15 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా చింతలబస్తీ వైపు 7 మీటర్ల మేర కబ్జాలు జరగగా బుధవారం హైడ్రా వాటిని తొలగించిన విషయం విధితమే. ఆక్రమణలు తొలగించినా.. కబ్జాల వల్ల కల్వర్టు కింద సగం భాగం పూడికపోయింది. ఆ పూడిక తీతతో పాటు.. కబ్జాల తొలగింపు పనులు త్వరగా జరగాలని ఆదేశించారు. జేసీబీలను కాలువలోకి దించి చెత్తను మొత్తం తొలగించాలని సూచించారు. వరదకు ఆటంకం లేకుండా.. నాలా ఇతర ప్రాంతాల్లో కూడా కబ్జాలుంటే తొలగించాలని ఆదేశించారు. శంకరిపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి వచ్చే బుల్కాపూర్ నాలా మియాఖాన్ గడ్డ, జన్వాడ, ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, రాయదుర్గం, ఓయూకాలనీ, షేక్‌పేట, బీజేఆర్ నగర్, మహాత్మాగాంధీనగర్, హఖిమ్సా విరాట్‌నగర్, బృందావన్ కాలనీ, టోలిచౌకి, మెహిదీపట్నం మిలటరీ ఏరియా, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు వరదనీరును ఈ చారిత్రక బుల్కాపూర్ నాలా తీసుకువస్తుంది.