ప్రాజెక్టుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఇంజినీర్లకు సీఎం సూచన

byసూర్య | Wed, May 14, 2025, 09:52 PM

తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జలసౌధ ప్రాంగణంలో నిర్వహించిన 'కొలువుల పండుగ' కార్యక్రమంలో భాగంగా, నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ఇంజినీర్లు , జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు  ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, ప్రాజెక్టుల విషయంలో పటిష్టతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.తమ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. "నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికీ మనకు నీరు అందుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 50, 60 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు ఎన్నో వరదలను తట్టుకుని నిలబడ్డాయి" అని ఆయన అన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయింది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఘటన జరగలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా ఒక్క వెయ్యి ఎకరాలకు కూడా నీరు అందలేదు. కనీసం మట్టి పరీక్షలు కూడా నిర్వహించకుండా ప్రాజెక్టును నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది" అని ఆరోపించారు.ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క వంటి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తామని, గ్రూప్‌-1 నియామకాలను అడ్డుకుంటున్న రాజకీయ నాయకులు ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. త్వరలోనే అన్ని గ్రూప్స్ నియామకాలు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.


Latest News
 

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం Sat, Jun 14, 2025, 08:26 PM
ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్ Sat, Jun 14, 2025, 08:24 PM
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం: సింగిరెడ్డి Sat, Jun 14, 2025, 08:19 PM
మంత్రి ఉత్తమ్‌కు ధన్యవాదాలు: హరీశ్ రావు Sat, Jun 14, 2025, 08:16 PM
డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం Sat, Jun 14, 2025, 08:15 PM