4 ఎకరాలపైబడిన వారికి ‘రైతుభరోసా’ నిధులు

byసూర్య | Wed, May 14, 2025, 07:35 PM

తెలంగాణలోని రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు భరోసాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నాలుగెకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక.. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


ఇందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్ది ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చేవారంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ఇక రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది. మొదటి దశలో భాగంగా రైతుల అకౌంట్లలోకి నిధులను జమ చేశారు. రెండో దశలో ఫిబ్రవరి 5న, మూడో దశలో ఫిబ్రవరి 11న రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి మూడు దశల్లో.. నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నాలుగెకరాలు ఆపై ఉన్న వారికి రైతు భరోసా నిధులు ఇంకా అందలేదు.


ఈ క్రమంలో వారందరికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, వీటిని కూడా దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటి వరకు నాలుగెకరాలలోపు రైతులందరికి రైతు భరోసా నిధులు జమయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఎకరాలకిపైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35లక్షల మంది ఉన్నారు. రబీ సీజన్‌కు సంబంధించిన వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మే చివరి నాటికి వారి ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ ఏడాదికి సంబంధించి.. ఖరీఫ్ సీజన్ జూన్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం.. జూన్ నెల వరకు రబీ సీజన్‌కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తరువాత జూలై నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


Latest News
 

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం: సింగిరెడ్డి Sat, Jun 14, 2025, 08:19 PM
మంత్రి ఉత్తమ్‌కు ధన్యవాదాలు: హరీశ్ రావు Sat, Jun 14, 2025, 08:16 PM
డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం Sat, Jun 14, 2025, 08:15 PM
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు భయం పట్టుకుందన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ Sat, Jun 14, 2025, 07:44 PM
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళుతుంటే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందని విమర్శ Sat, Jun 14, 2025, 07:40 PM