కేంద్ర ప్రభుత్వ యుద్ధ విరమణపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు

byసూర్య | Tue, May 13, 2025, 06:09 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యుద్ధ విరమణ నిర్ణయంపై, ముఖ్యంగా దానిని ప్రకటించిన తీరుపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. దేశమంతా సైన్యానికి అండగా నిలిచిన కీలక సమయంలో, ఎలాంటి చర్చలు లేకుండా కేవలం 'ఎక్స్' వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యుద్ధ విరమణ చేయడం ఆవేదన కలిగించిందని అన్నారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మన సైనికులు ధైర్యసాహసాలతో పోరాడుతున్న వేళ, వారి త్యాగాలు ఒక కొలిక్కి రాకముందే యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేయడం ద్వారా ప్రధాని మోదీ వారి పోరాట స్ఫూర్తిని నీరుగార్చారని ఆరోపించారు."దేశమంతా ముక్తకంఠంతో సైన్యానికి సంఘీభావం ప్రకటించిన సమయంలో, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ఒక్క ఎక్స్ పోస్టుతో దేశ సార్వభౌమత్వాన్ని ప్రధాని మోదీ ప్రశ్నార్థకంగా మార్చారు" అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇందిరాగాంధీ దాయాది దేశం విషయంలో వ్యవహరించినంత సమర్థవంతంగా మోదీ వ్యవహరించలేకపోయారని పొన్నం విమర్శించారు. చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశ్నించిన మోదీ, ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయానికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.దేశ ప్రజలు, కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర ప్రభుత్వ చర్యలకు సంపూర్ణ మద్దతు ప్రకటించినప్పటికీ, ఇలాంటి కీలకమైన నిర్ణయాన్ని 'ఎక్స్' వేదికగా ప్రకటించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. యుద్ధ విరమణకు దారితీసిన పరిస్థితులపై పార్లమెంట్ వేదికగా సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా, కేవలం ఒక 'ఎక్స్' సందేశంతో యుద్ధాన్ని ఎందుకు విరమించాల్సి వచ్చిందో ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ కూడా పాకిస్థాన్‌పై చేపట్టే చర్యలకు మద్దతు ప్రకటించిన తరుణంలో, యుద్ధాన్ని ఆపివేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందని పొన్నం ప్రశ్నించారు. "దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక భారతీయ పౌరుడిగా నేను ప్రధాన మంత్రిని దీనిపై ప్రశ్నిస్తున్నాను" అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సైనికుల త్యాగాలు వృధా కాకూడదని, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM