వేములవాడ భక్తులకు భారీ శుభవార్త.. ఇక నుంచి తిరుపతి తరహాలో, నిత్యం ఉచితంగా

byసూర్య | Mon, Jan 13, 2025, 08:09 PM

దక్షిణకాశీగా పేరుపొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త వినిపించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి.. మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్‌లో కూడా రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి.. ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్నట్టు తెలిపారు. అన్నదాత బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పుకొచ్చారు.


మరోవైపు.. వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. ఇక.. ఆది శ్రీనివాస్‌తో పాటు వేములవాడ భక్తుల చిరకాల స్వప్నం.. రాజన్న సన్నిధిలో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు వేములవాడలో నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి 35 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని తెలిపారు.


రూ.35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్టులో ఇప్పటికే రూ.20 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రూ.వంద కోట్లుగా చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది, ఈ ప్రాంత ప్రజలదేనని తెలిపారు. ఈ క్రమంలోనే.. తమ కుటుంబం తరపున 40 లక్షల రూపాయలను రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


రాజరాజశ్వర స్వామి భక్తులు విరాళాలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్‌లో రశీదులు తీసుకొని విరాళాలు ఇవ్వాలన్నారు. లేదంటే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఈవోని కలిసి విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిత్యాన్నదాన సత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అందరు సహకరించాలన్నారు. వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్‌కి సంబంధించి విరాళాలు ఏం ఇచ్చిన సరేనని.. రైతులు బియ్యం, కూరగాయలు కూడా ఇవ్వొచ్చని పొన్నం ప్రభాకర్ తెలిపారు.


.


Latest News
 

నకిలీ విత్తనాలపై చర్యలు శూన్యం.? Sun, Feb 09, 2025, 11:04 PM
పేకాట స్థావరం పై దాడి, పలువురి పై కేసు నమోదు... Sun, Feb 09, 2025, 11:01 PM
తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు Sun, Feb 09, 2025, 10:58 PM
హెల్మెట్‌, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌.. Sun, Feb 09, 2025, 10:56 PM
10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం Sun, Feb 09, 2025, 10:55 PM