byసూర్య | Fri, Dec 13, 2024, 07:28 PM
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ, కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సమైక్యాంధ్రను కోరుకున్న కాంగ్రెస్ నాయకులు ఎత్తుకున్న వాదనలను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. “వాళ్లు కాంగ్రెస్ వాదులు.. తెలంగాణవాదులు కాదు. వాళ్లకు ఎప్పుడూ కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ” అని స్పష్టం చేశారు.
శుక్రవారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ… ఇందిరా గాంధీ, సోనియా గాంధీ బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారని, ఎన్నికల సమయంలో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకొని శుభాకాంక్షలు చెప్పారని గుర్తు చేశారు. 1978లో వరంగల్ మహిళలతో కలిసి ఇందిరా గాంధీ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారని చెప్పారు. భారత్ జోడో యాత్రతో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులతో కలిసి బతుకమ్మ ఆడారని చెప్పారు. అంటే.. ఓట్లు ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ నాయకులకు బతుకమ్మ గుర్తుకొస్తుందని, ఓట్ల కోసం ఎన్ని ఆటలైనా ఆడుతారని విమర్శించారు. ఓట్లు అయిపోయిన తర్వాత బతుకమ్మ ఎవరిదని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకు ఉండాలని కాంగ్రెస్ నాయకులు వెర్రి ప్రశ్నలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించారని, మరి రాష్ట్ర పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్న మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారో, ఏం శిక్ష వేస్తారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆంబోతులను వదిలిట్లు తెలంగాణ ఆడబిడ్డలపై మాట్లాడటానికి మంత్రులను, కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టారా అన్నది ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.
ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటామని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకుంటామని ప్రకటించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడానికి ప్రజల ఆమోదం ఉన్నట్లయితే జీవోతో పనేముందని ఎమ్మెల్సీ కవిత అడిగారు. కేసులు పెడుతామని బెదిరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎందుకింత పిరికితనమని నిలదీశారు. విగ్రహాన్ని కూడా రహస్యంగా తయారు చేయించారని విమర్శించారు. అంత రహస్యంగా విగ్రహాన్ని రూపొందించడానికి ఇదేమైనా ఫ్యూడల్ వ్యవస్థనా, నాజీ ప్రభుత్వమా అని అడిగారు. ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్న పాటలు చూస్తే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉందని, తెలంగాణకు సంబంధం లేని పాటలు పాడుతున్నారని, తెలంగాణలో ఎంతో మంది జానపద కళాకారులు ఉంటే… ఒక్క కళాకారుడు కూడా పాట పాడడానికి దొరకలేదా ? పాడడానికి ఒక్క తెలంగాణ పాట దొరకలేదా అని ప్రశ్నించారు.
The Gandhis celebrate #Bathukamma for optics but stay silent as their CM Revanth Reddy erases it from the #TelanganaThalli statue. Chief Minister Revanth Reddy with zero role in our statehood now destroys the soul of Telangana’s heritage. @RahulGandhi Ji, do you endorse this… pic.twitter.com/GzwJKFfEW8
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 13, 2024