byసూర్య | Tue, Dec 10, 2024, 04:35 PM
సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్( నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి ని చంపుతా అని తుపాకీ పట్టుకుని తిరిగిన వాడు ఇవాళ రాష్ట్రానికి కొత్త తల్లిని తీసుకొచ్చాడని విమర్శించారు. కిరాయి రాతగాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నిన్న సీఎం చదివారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణ సంస్కృతిపైన జరుగుతున్న భయంకర దాడి అని అన్నారు. దారి తప్పి ఆ దొంగల వెంట నడుస్తున్న తెలంగాణ వాదులు పునరాలోచించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలంతా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పేరిట అడ్డమైన పాటలు పాడారని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్కరికీ తెలంగాణ భావేద్వేగం లేదని అన్నారు. కేసీఆర్(KCR) హయంలో బతుకమ్మ(Bathukamma)ను అధికారికంగా జరిపాం, బతుకమ్మ పండక్కి చీరలు ఇచ్చామని గుర్తుచేశారు. సమైక్య బాస్‌లను సంతృప్తి పరిచేందుకు రేవంత్(Revanth) కొత్త తల్లిని సృష్టించారని అన్నారు. తెలంగాణకు సంబంధం లేని ఆటలు పాటలు మళ్ళీ రుద్దుతున్నారని తెలిపారు. తెలంగాణ వాదులు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. అధికారం ఉందని ఆహారపు అలవాట్లపై, కట్టుబాట్లపై ఆంక్షలు పెడితే కుదురుతుందా? అని అన్నారు. ఆ జీవోను అధికారులు ఎలా తెచ్చారో అర్థం కావడం లేదు అని అన్నారు.