byసూర్య | Mon, Dec 02, 2024, 03:15 PM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ లో కులదుహంకార హత్య చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేస్తుందని తన అక్కను ఆమె సోదరుడు నరికి చంపాడు. ద్విచక్ర వాహనాన్ని వెంబడించి కారుతో వెనక నుండి గుద్ది, వేటకొడవలితో నరికి చంపాడు. అందుకు ఆస్తి తగాదాలు కూడా అడ్డు వచ్చాయి. హత్య ఉదాంతం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అందుకు సంబంధించి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, స్థానికుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామానికి చెందిన కొంగర పద్మ, రమేష్ అనే దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. తమ చిన్న కూతురు నాగమణి, అదే గ్రామంలోని ఎస్సీ కులానికి హంసమ్మ, సత్తయ్య అనే దంపతుల కుమారుడైన శ్రీకాంత్ ను ప్రేమించింది. వీరు నవంబర్ 10న యాదగిరిగుట్టలో వివాహం చేస్తున్నారు. తాను కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని నాగమణి ఇబ్రహీంపట్నం పోలీసులకు వివాహం చేసుకున్న సందర్భంగా ఫిర్యాదు చేసింది. ఆ సందర్భంగా ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ పిలిపించి ఇబ్రహీంపట్నం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరి దారిలో వారు ఉండాలని సూచించారు. అయితే అప్పుడే నాగమణి పేరు మీద ఉన్న ఎకరం భూమిని సైతం నాగమణి సోదరుడైన కొంగర పరమేష్ తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేయడంతో ఆ భూమిని సైతం తన తమ్ముడికి రిజిస్ట్రేషన్ చేసింది. భవిష్యత్తులో కూడా తన తల్లిదండ్రి సంపాదించిన ఆస్తుల్లో భాగం ఉంటుందని కేసులు వేయడం గానీ, ఆస్తి అడగడం గానీ జరగవద్దని ఆ సందర్భంగా కొంగర పరమేష్ అక్కను హెచ్చరించారు. ఆ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటమాట పెరిగినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే కోర్టు ద్వారా తన ఆస్తిని తీసుకుంటానని ఆ సందర్భంగా నాగమణి తన సోదరుడైన పరమేశ్ కు కూడా కరాకండిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ నగరంలోనే ఉంటున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో భార్యాభర్తలు ఇద్దరు స్వగ్రామమైన రాయపోల్ కు వచ్చారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో విధుల్లో హాజరయ్యేందుకు తన స్కూటీ టీఎస్ 07 జేఆర్ 4801పై రాయపోల్ నుండి మన్నెగూడ మీదుగా హయత్ నగర్ కు నాగమణి బయలుదేరింది. రాయపోల్ గ్రామం నుంచి హయత్ నగర్ కు ఒంటరిగా నాగమణి బయలుదేరుతున్న విషయాన్ని గమనించిన ఆమె సోదరుడు కొంగర పరమేష్ తన కారులో ఆమెను వెంబడించారు. రాయపోల్ - మన్నెగూడ మార్గ మధ్యలో నాగమణి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి కారుతో ఒక్కసారిగా ఢీకొట్టాడు. దాంతో నాగమణి స్కూటీపై నుంచి కింద పడిపోయింది. వెంటనే అప్పటికే తన కారులో సిద్ధంగా ఉంచుకున్న వేట కొడవలితో నాగమణి మెడపై నరికాడు. దాంతో నాగమణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కానిస్టేబుల్ నాగమణి హత్య విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఎస్ఐ నాగరాజు, రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాగమణిని నరికిన వేట కొడవలి, ద్విచక్ర వాహనం, ఆమె ధరించ హెల్మెట్, బ్యాగుతో పాటు నాగమణిని గుద్దిన కారు నెంబర్ ప్లేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ నాగమణి మృతదేహాన్ని ఉస్మాని ఆస్పత్రికి తరలించారు.