byసూర్య | Tue, Nov 12, 2024, 10:22 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన నేపథ్యంలో రౌడీయిజం, గుండాయిజంతో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు హెచ్చరించారు. మంగళవారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఈ దాడి చేసేందుకు 10 రోజుల ముందు నుండి ఎవరు ఎలా ప్లాన్ చేశారో త్వరలో బయట పెడుతామన్నారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని.. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అయితే పథకం ప్రకారం కొందరు అమాయక రైతులను రెచ్చగొట్టి ఈ దాడి చేయించారని మంత్రి ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ ఇప్పటికే చేపట్టిందని తెలిపారు.
ఈ అమానుష కాండకు పాల్పడిన కుట్రదారులు ఎవరో విచారణ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తితో ముందుకు వెళ్తుందని చెప్పారు. కానీ అధికారం పోయిందనే ఆక్రోశంతో తమ ప్రభుత్వం మంచి పని చేస్తున్న అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారశైలిని ఈ సందర్భంగా డి. శ్రీధర్ బాబు ఎండగట్టారు.రాష్ట్రాభివృద్ధి కోసం తాము వేసే ప్రతి అడుగులో ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆయన మండిపడ్డారు. జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేద్దామంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన వెనుక ఎవరున్నారో, రాష్ట్రాభివృద్ధి కాకుండా చేయాలని ఎవరు చూస్తున్నారో అన్ని విషయాలు త్వరలోనే బయటపెడుతామన్నారు. అలాగే ఈ దాడి ఘటనలో ఎవరి వైఫల్యమున్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఐఏఎస్ ప్రశాంత్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏ అంశాన్ని రాజకీయం చేయాలనే ఆలోచన తమకు లేదని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు బల్లగుద్ది మరి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో తమకేం తెలుసునన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆ పార్టీకి ఏటీఎంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆర్థిక సంక్షోభం సృష్టించారని.. దానిని తమకు వారసత్వంగా ఇచ్చారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం..
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మంత్రి శ్రీధర్ బాబు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఉదయం మాట్లాడితే... బీజేపీ సాయంత్రం మాట్లాడుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌లోని లగచర్లలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తే.. పదివేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అయితే ప్రజల పేరు చెప్పుకొని బీఆర్ఎస్ నేతలు తెగ బాధ పడుతున్నారంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం..
జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి డి. శ్రీధర్ బాబు స్పందించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి సంక్షేమానికి తాము ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.