byసూర్య | Tue, Nov 12, 2024, 09:51 PM
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని వర్షాలకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ అధికారులు వెల్లడించారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నంద్యాల, వైఎస్ఆర్ , తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఇక తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలో 15 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. నగరం అంతటా ఉదయం పొగమంచు ఉంటుంది. నగర శివార్లలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అవుతుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలికాలం వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మందపాటి దుస్తులు ధరించాలని పేర్కొంటున్నారు. అస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.