byసూర్య | Tue, Nov 12, 2024, 08:02 PM
అయ్యా, రేవంత్ రెడ్డి గారూ... ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర పర్యటనలు ఆపి, కొంచెం ప్రజా సమస్యలపై దృష్టి సారించండి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్వయంగా మీ సొంత నియోజకవర్గం కొడంగలే కొలిమిలా మారిందని రాసుకొచ్చారు. మీ అసమర్థత, ప్రతీకారధోరణి, అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం 19,000 ఎకరాలు సేకరించి ఉంచినప్పటికీ... మళ్లీ వేలాది ఎకరాలు అదనంగా ఫార్మాకు ఎందుకు సేకరిస్తున్నారో... ప్రజలకు, రైతులకు చెప్పాలన్నారు. వారికి సమాధానం చెప్పకుండా అమాయక అధికారులను మానవ కవచంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొడంగల్ ఘటనలో దాడికి గురైన అధికారుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు. అయితే పేదరైతులతో నేరుగా మాట్లాడాల్సిన సీఎం అతను తన విధిని మరిచాడన్నారు.అమాయక అధికారులు ఘటనాస్థలికి వెళ్లి... పేద రైతుల ఆగ్రహానికి గురయ్యేలా చేశాడని మండిపడ్డారు. ఇది సీఎం బాధ్యతారాహిత్యం అన్నారు. వేలాది ఎకరాలు ఉన్న మీకే దానగుణం లేనప్పుడు రెక్కాడితే గానీ డొక్కాడని... భూమినే నమ్ముకున్న పేద బంజారాలు భూమిని ఎలా ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. వాళ్లకు మీ ఫార్మా కంపెనీలో ఏమైనా భాగస్వామ్యం ఇస్తారా? అని నిలదీశారు.మీరు తలుచుకుంటే గ్రూప్-4 అభ్యర్థులకు అన్‌విల్లింగ్ ఆప్షన్ రెండు నిమిషాల్లో వస్తుందని, తద్వారా వేలాది బ్యాక్‌లాగ్ పోస్టులు మిగలకుండా ఆపవచ్చని... కానీ మీకు రెండు నిమిషాల టైం కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఇక రైతుల సంగతి సరే సరి... ఇలా ఎన్నో సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని రాసుకొచ్చారు. మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఒక అనాథగా - అగ్నిగుండంగా మారిందని విమర్శించారు. జీవనం ఎడతెరిపిలేని యుద్ధంలా తయారైందని పేర్కొన్నారు.