byసూర్య | Tue, Nov 12, 2024, 07:55 PM
మనిషి జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు ఆనందంగా, సంతోషంగా గడిపినవారు సైతం ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ ఇలా అప్పటిదాక అందరితో సరదాగా గడిపినవారు క్షణాల్లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే దేవుని సన్నిధిలోనే మృత్యు ఒడికి చేరుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విష్ణువర్ధన్ అనే యువకుడు కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విష్ణువర్ధన్.. ప్రతిరోజు వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే గుడిలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో విష్ణుకు కాస్త అలసటగా అనిపించింది. దీంతో ఆలయంలో ఉన్న ఓ వాటర్ ఫిల్టర్ వద్దకు వెళ్లి మంచినీరు తాగాడు. అనంతరం తిరిగి మళ్లీ ప్రదక్షిణలు ప్రారంభించాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై దేవ సన్నధిలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి భక్తులు, ఆలయ అర్చకులు విష్ణువవర్ధకు సపర్యలు చేశారు. అయినా చలనం లేకపోవటంతో వెంటనే 108 వాహనంలో స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్‌కు తరలించారు. విష్ణువర్ధన్‌ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. విష్ణువర్ధన్ గుడిలో కుప్పకూలిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
విష్ణువర్ధన్ మృతి విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కార్తీక మాసం కావడంతో ఉదయం దైవ దర్శనానికి వెళ్లాడని.. కానీ ఇలా గుడిలోనే విగతజీవి మారతాడని ఊహించలేకపోయామంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.