కుటుంబ సర్వేతో కార్డులు పోతాయా.. అవాస్తవాలు చెబితే ఏం చేస్తారు? క్లారిటీ ఇచ్చిన మంత్రులు.

byసూర్య | Wed, Nov 06, 2024, 10:28 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు బుధవారం (నవంబర్ 6) ఉదయం సర్వేను ప్రారంభించారు. సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది (ఎన్యుమరేటర్లు) ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 75 రకాల ప్రశ్నలపై కుల గణనలో వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో ఆదాయం ఎంత? ఆస్తులెన్ని? ట్యాక్స్ చెల్లిస్తున్నారా? ఏమేం వాహనాలు ఉన్నాయి? పట్టాదారు పాసుపుస్తకం నంబర్, ఆధార్ నంబర్ లాంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ వివరాలన్నీ ఇస్తే.. తమకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పథకాలు పోతాయేమో, తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ లాంటివి తీసేస్తారేమో అనే అపోహలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు.


తెలంగాణ ప్రజలందరికీ సమన్యాయం చేసేందుకే కుల గణన సర్వేను ప్రారంభించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకే ఈ సర్వేను చేస్తున్నామని ఆయన చెప్పారు. ‘ఈ సర్వేతో రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పోతాయని కొంత మంది ప్రచారం చేసి, భయపెట్టవచ్చు. ఈ సర్వేతో ఏ కార్డులు పోవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసేందుకే ఈ సర్వే చేస్తున్నాం. సర్వే ద్వారా సేకరించిన వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం’ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


ఇంటింటి కుటుంబ సర్వే వివరాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు.. బుధవారం ఉదయం కుటుంబ సర్వేను ప్రారంభించారు. కుటుంబ సర్వే సమయంలో సిబ్బంది ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను తీసుకోరని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలి. ప్రజల సహకారం ఉంటే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అందరి సలహాలు తీసుకున్నాకే ఈ ప్రశ్నలు రూపొందించాం. ఇంటింటి సర్వేతో రాష్ట్రం రోల్‌ మోడల్‌గా మారబోతుంది’ అని పొన్నం అన్నారు.


తెలంగాణ కుల గణన సర్వే ఇలా..


✦ సర్వేలో భాగంగా ఈ 3 రోజుల పాటు ఇంటింటికి స్టిక్కర్లు అంటించనున్నారు. నవంబర్ 30 వరకు సర్వే కొనసాగనుంది.


✦ రాష్ట్రవ్యాప్తంగా 40 వేల టీచర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఇందు కోసం కొన్ని రోజుల పాటు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు.


✦ ఎన్యుమరేటర్లు ఇంటి వద్దకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే.. బంధువులు, సన్నిహితుల ద్వారా వారి వివరాలను నమోదు చేయించవచ్చు.


✦ సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబరు, ఆధార్ నంబర్, వారి వృత్తి, ఉద్యోగ వివరాలను నమోదు చేస్తారు.


✦ కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే, వారు ఏ కారణంతో వెళ్లారనేది (ఉన్నత చదువు/ ఉద్యోగం/ వ్యాపారం/ పెళ్లి లేదా ఇతర అవసరం) కూడా చెప్పాలి.


✦ సర్వేలో "No Religion and No Caste" కాలమ్‌ను కూడా చేర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కులం, మతం వివరాలను వెల్లడించేందుకు ఇష్టపడని వారి కోసం ఈ కాలమ్‌ను చేర్చాలని సూచించింది. ప్రధానంగా.. కులమతాలకు దూరంగా అభ్యుదయ జీవనం సాగిస్తున్న వారి మనోభావాలను గౌరవించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పునిస్తూ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.


తెలంగాణ నుంచి ఎంత మంది వలస వెళ్లారు? ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు పొందుపరిచినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం పథకాల నుంచి అందే లబ్ధి పోతుందనో, మరేదైనా కారణంతోనో సర్వేలో అవాస్తవాలు చెబితే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.


Latest News
 

ఈ అన్నం పిల్లలు తింటారా..? హాస్టల్ వార్డెన్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫైర్ Sun, Dec 01, 2024, 10:33 PM
నటి శోభిత ఆత్మహత్య.. భర్త ఇంట్లో ఉండగానే.. గోవా టూర్‌ నుంచి వచ్చిన రెండ్రోజుల్లో Sun, Dec 01, 2024, 10:31 PM
తెలంగాణ రైతులకు తీపి కబురు.. రేపు అకౌంట్లలో డబ్బులు జమ Sun, Dec 01, 2024, 10:29 PM
మద్యం మత్తులో హిట్ అండ్ రన్.. స్పాట్‌లోనే దంపతులు మృతి Sun, Dec 01, 2024, 10:27 PM
కన్నడ నటి శోభిత హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడింది Sun, Dec 01, 2024, 09:58 PM