వరంగల్ చుట్టూ ఓఆర్ఆర్, ఇన్నర్ రింగు రోడ్డు కూడా.. ఆ ప్రాంతాల్లో భూములకు రెక్కలు

byసూర్య | Wed, Nov 06, 2024, 10:06 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్. దీంతో.. అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. అయితే.. అభివృద్ధి జరగాలంటే ఒకటి అక్కడ వనరులుండాలి.. ఇంకోటి రవాణా వ్యవస్థ బాగుండాలి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు ఉండటంతో.. నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా.. భూముల ధరలు కూడా పెరిగి.. ఆ ప్రాంతాల్లో చెప్పుకొదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు అభివృద్ధి మొత్తం హైదరాబాద్ చుట్టే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. కొద్ది రోజులుగా రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్న మాట కాస్త గట్టిగానే వినిపిస్తోంది.


దీంతో.. వరంగల్‌ మీద రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. చారిత్రాత్మక వరంగల్‌ నగరాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్లు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల వరంగల్‌లో పర్యటించిన మంత్రి పొంగులేటి.. వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పుకొచ్చారు.


ఈ క్రమంలోనే.. వరంగల్, హనుమకొండ అభివృద్ధిపై మంగళవారం (నవంబర్ 05న) రోజున మంత్రులు సమావేశం అయ్యారు. వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, ఇన్నర్ రింగు రోడ్డులకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. వరంగల్ పట్టణం చుట్టూ 41 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కాగా.. ఈ ఔటర్ రింగు రోడ్డను మూడ దశల్లో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మొదటి దశలో 20 కిలో మీటర్లు, రెండో దశలో 11 కిలో మీటర్లు, మూడో దశలో 10 కిలోమీటర్లు నిర్మించే అవకాశం ఉంది. ఈమేరకు అధికారులు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది.


 అయితే.. ఈ కీలక భేటీలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరానికి దీటుగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు తెలిపారు.


కాగా.. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత జూన్‌లో వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. వరంగల్‌తో పాటు కరీంనగర్ కూడా అభివృద్ధి చేస్తే జంట నగరాలుగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


అయితే.. ప్రభుత్వం చెప్తున్నట్టుగా వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించి.. ఇన్నర్ రింగు రోడ్డుతో పాటు ఔటర్ రింగు రోడ్డు నిర్మించి.. మామునూరు విమాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తే.. ఇక వరంగల్ దశ తిరిగినట్టే. ఔటర్ రింగు రోడ్డు, మామునూరు విమానాశ్రయం ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొస్తాయి. ఆయా ప్రాంతాల్లో భూములున్న ప్రజల పంటలు పండినట్టే. అంతే కాదు ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగనున్నాయి. మరి చూడాలి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వరంగల్ వాసుల జీవితాలను ఎలా మార్చనున్నాయో..


Latest News
 

ఈ అన్నం పిల్లలు తింటారా..? హాస్టల్ వార్డెన్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫైర్ Sun, Dec 01, 2024, 10:33 PM
నటి శోభిత ఆత్మహత్య.. భర్త ఇంట్లో ఉండగానే.. గోవా టూర్‌ నుంచి వచ్చిన రెండ్రోజుల్లో Sun, Dec 01, 2024, 10:31 PM
తెలంగాణ రైతులకు తీపి కబురు.. రేపు అకౌంట్లలో డబ్బులు జమ Sun, Dec 01, 2024, 10:29 PM
మద్యం మత్తులో హిట్ అండ్ రన్.. స్పాట్‌లోనే దంపతులు మృతి Sun, Dec 01, 2024, 10:27 PM
కన్నడ నటి శోభిత హైదరాబాదులో బలవన్మరణానికి పాల్పడింది Sun, Dec 01, 2024, 09:58 PM