byసూర్య | Tue, Nov 05, 2024, 11:25 PM
తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించిందని అన్నారు. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.
జిల్లాలు- ప్రత్యేకాధికారులు:
ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల- కృష్ణ ఆదిత్య
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా -ఆర్వీ కర్ణన్
నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట- అనితా రామచంద్రన్
నిజామాబాద్, కామారెడ్డి- డా. ఏ.శరత్
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి-డి. దివ్య
మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్ -రవి
వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్- టి. వినయ కృష్ణా రెడ్డి
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట- హరిచందన దాసరి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం -కె. సురేంద్ర మోహన్
వరికి రూ.500 బోనస్.. కాగా, ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా వరికి రూ. 500 బోనస్ ఈ సీజన్ నుంచే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బోనస్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. వరి ధాన్యం సన్నాల్లోని 33 రకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వరి ధాన్యం గింజ పొడువు, వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనేది కొనుగోళ్ల సమయంలో తెలుసుకోనున్నారు. అందుకు ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మైక్రో మీటర్లను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గింజ పొడవు 6 మిల్లీ మీటర్ల కంటే తక్కువ.. వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కాకుండా ఉండాలని ప్రభుత్వం వెల్లడించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ధాన్యం తేమ 17 శాతానికి మించనప్పుడు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.500 బోనస్ వర్తింపజేయనున్నారు.