byసూర్య | Tue, Nov 05, 2024, 11:23 PM
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశలో తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. నేడు రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
దక్షిణ తమినాడు, శ్రీలంక తీరాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఫలితంగా నేడు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో మాత్రం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.
ఇక తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్ర పెరుగుతోందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 18 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని చెబుతున్నారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
ఇక నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రేపు లేదా ఎల్లుండి (నవంబర్ 6, 7) తేదీల్లో మరో అల్ప పీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. నవంబర్ రెండో వారంలోనూ మరో అల్ప పీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలతో పాటుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 7 నుంచి 11 వరకు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.