ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు, ఆ ఛార్జీలు కూడా తగ్గింపు

byసూర్య | Sat, Nov 02, 2024, 11:20 PM

ప‌విత్ర కార్తీక మాసం సందర్భంగా తెలంగాణలోని భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాల‌కు భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్టతో పాటు పలు దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం, త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి శ‌నివారం (నవంబర్ 02న) వ‌ర్చువ‌ల్‌గా ఉన్నత‌స్థాయి స‌మీక్షా స‌మావేశాన్ని స‌జ్జనార్ నిర్వహించారు.


ఆర్టీసీకి కార్తీక మాసం, శ‌బ‌రిమ‌ల ఆప‌రేష‌న్స్ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు సజ్జనార్ దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు.


ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని అరుణాచ‌లానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాల‌కు ప్రతి సోమ‌వారం ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు వివ‌రించారు. ఈ ప్రత్యేక బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవాల‌న్నారు. మ‌రిన్నీ వివ‌రాల‌కు ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాల‌ని సూచించారు.


బ‌స్ ఆన్ కాంట్రాక్ట్ (బీవోసీ) ఛార్జీలు త‌గ్గింపు..అద్దె ప్రాతిపదిక‌న ఆర్టీసీ బ‌స్సు ఛార్జీలను త‌గ్గించిన‌ట్లు స‌జ్జనార్ తెలిపారు. ప‌ల్లె వెలుగు కిలోమీట‌ర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డిల‌క్స్ రూ.8, సూప‌ర్ ల‌గ్జరీ రూ.6, రాజ‌ధాని రూ.7 మేర త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. శ‌బ‌రిమ‌ల‌కు, శుభ‌ముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బ‌స్సుల‌ను బుకింగ్ చేసుకుని.. క్షేమంగా గ‌మ్యస్థానాల‌కు చేరుకోవాల‌ని సజ్జనార్ సూచించారు.


గతంలోనూ.. కార్తీక మాసం వేళ.. రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకుని.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించింది. కాగా.. ఆ సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన రావటంతో.. ఈసారి కూడా స్పెషల్ బస్సులు నడిపించేందుకు టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డి పై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు Tue, Dec 10, 2024, 04:35 PM
ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి Tue, Dec 10, 2024, 04:29 PM
నెలలో మూడున్నర కోట్ల విలువైన 1,100 ఫోన్లు రికవరీ Tue, Dec 10, 2024, 04:13 PM
సీసీ రోడ్లు వేయించమని వినతి పత్రం Tue, Dec 10, 2024, 04:12 PM
తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే Tue, Dec 10, 2024, 04:05 PM